మెస్ చార్జీలు,స్కాలర్‌షిప్‌లు పెంచాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమ దుస్థితి తెలియజేస్తూ విద్యార్థులు ఖాళీ ప్లేట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. ధర్నానుద్దేశించి కృష్ణయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచాలని ఎన్నిమార్లు విన్నవించినా, ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాలను 3 నుంచి 10 రెట్లు పెంచారని, అందరికి తెలంగాణను బహుమతిగా ఇచ్చి తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులను మాత్రం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు.అరుుదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల మెస్‌చార్జీలను తక్షణం పెంచాలని కోరారు.సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 24 వందల వార్డెన్ల, వాచ్‌మెన్, కామాటి, కుక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. హాస్టళ్లలో ప్రతీ ఆదివారం మాంసాహార భోజనం పెట్టాలన్నారు. బీసీ నేతలు నీల వెంకటేష్, కుల్కచర్ల శ్రీనివాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నరిసింహగౌడ్, తదితరులు పాల్గొన్నారు.