బీసీ జాబితా ధర్మసత్రం కాదు
ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలన్న అంశంపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు. ఎవరు పడితే వారు వచ్చి చేరడానికి బీసీ జాబితా ధర్మసత్రం కాదన్నారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలనుకుంటే... జనాభా, ప్రాతినిధ్యం, వెనుకబాటుతనం, సామాజిక వివక్షత వంటి కారణాలతో ఇబ్బందిపడుతున్నవారిపై సమగ్ర సర్వే జరిపి రాజ్యాంగాన్ని అనుసరించి తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు. అంతేగాని అది రాజకీయపార్టీలు తీసుకునే నిర్ణయం కాదని, ఎవరి ఒత్తిడులకోసమో, బెదిరింపులకోసమో అన్ని రకాలుగా బాగున్న కాపులను బీసీల జాబితాలో చేర్చుతామంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీసీలు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారని, త్వరలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి
వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీ యువతులకు కూడా ‘కల్యాణలక్ష్మి’ పథకం కావాలన్నారు. పది వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 25 నుంచి 52శాతంకు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 250 బీసీ కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు లేవనీ వీటి నిర్మాణానికి రూ.750 కోట్లు కేటాయించాలని కోరారు. విదేశాలకు ఉన్నత చదువులు చదవడానికి వెళ్లే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. ముఖ్యమంత్రితో చర్చించి బీసీల బడ్జెట్‌ను పెంచుతామని మంత్రి ఈటల హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు.