దేశంలోని 70 కోట్ల మంది వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సమర్థులైన బీసీ నేతలున్నా వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆయన విమర్శించారు.
బుధవారం బీసీ భవన్‌లో జరిగిన ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీసీ కులంలో పుట్టడమే ముఖ్యమంత్రి పదవికి అనర్హతగా మారిందని, ఇప్పటివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 30 మంది ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క బీసీ కూడా ఆ జాబితాలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన జరపాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగరమేశ్, ఎస్. దుర్గయ్యగౌడ్, కె. బాలరాజ్, నీలవెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, పెరిక సురేశ్, అశోక్‌గౌడ్, నర్సింహనాయక్, జి. అంజి, ఎ.పాండు, పి.సతీశ్, జి.భాస్కర్, బి.సదానందం తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు అన్యాయం చేస్తోన్న కేంద్రం: ఆర్. కృష్ణయ్య
Published Wed, Aug 7 2013 7:39 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement