
హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగ భాగం వాటా దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలు–బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో బీసీ డిమాండ్లపై చర్చించి నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 65 బీసీ కుల సంఘాల అధ్యక్షులు, 20 బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా మంజూరు చేయాలని, బ్యాంకులతో నిమిత్తం లేకుండా వంద శాతం సబ్సిడీతో ప్రతి బీసీ కుటుంబానికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడానికి వెంటనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో బీసీ భవన్‌కు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మించాలని, బీసీ ఫెడరేషన్‌లను కొనసాగించి ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
మార్చిలో బహిరంగ సభ
బీసీల శక్తిని ప్రదర్శించడానికి మార్చిలో పది లక్షల మందితో హైదరాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం తీర్మానించినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మొల్ల జయంతి, భగీర«థ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని, మొల్ల, సర్దార్ సర్వాయి పాపన్న, భగీరథ మహర్షి, జ్యోతిబాపూలే, దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నేతలు గణేష్‌చారి, ఏఎల్ మల్లయ్య, అయిలి వెంకన్న, గోగికార్ సుధాకర్, బంగారు నర్సింహ్మ సగర, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment