సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, గుడులు, బడులను దర్జాగా కబ్జా చేసి తిరుగుతున్న భూ బకాసురులను వదిలి ఆకలి కోసం అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేటలోని స్థానిక ఆదివాసీలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి వేసుకున్న గుడిసెలను వందలాది మంది ఫారెస్టు పోలీసులతో ఏకదాటిగా దాడి చేసి కూల్చివేయడం అన్యాయమని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివాసి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా వ్యహరించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆదివాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజనులపై ఆకృత్యాలకు పాల్పడిన ఫారెస్టు, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఆదివాసి గిరిజనులకు దేశంలో బతికే హక్కులేదా అని నిలదీశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల వస్త్రాలను చిందరవందర చేస్తూ ఘోరంగా లాక్కెడం రజకార్ల పాలనను తలపించిందని ఆరోపించారు. గిరిజనుల పోరాటానికి బీసీ సమాజం పూర్తి మద్దతు ఇస్తుందని జాజుల ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment