టెట్, ఎంసెట్ వాయిదాపై నిరసన
కవాడిగూడ: రాష్ట్రంలో టెట్, ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ క్రి ష్ణ మాట్లాడుతూ ఆదివారం జరగాల్సిన టెట్, సోమవారం జరగాల్సిన ఎంసెట్ పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పరీక్షలను వాయిదా వేయలని నిర్ణయించడం దారుణమన్నారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించకుండా దూకుడుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
నిరుద్యోగ అభ్యర్థులు రూ.వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న తరుణంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా జాతీయ స్థాయిలో నిట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా అందుకు ముందస్తుగా సిద్దం చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. నీట్ పరీక్షకు, అందుకు సంబంధించిన సిలబస్ అలవాటు పడేంత వరకు రెండేళ్ల గడువు కోరాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాసమల్ల శ్రీనివాస్, నాయకులు గంగనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.