
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హాల్‌లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు, ఏపీలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు.
ఖాళీల భర్తీలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలు, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 12 లక్షల ఉద్యోగాలు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. రిటైర్ అయిన వారిని వోఎస్‌డీలు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగులుగా ఇప్పటివరకు 2 వేల మందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది రోడ్డు మీద తిరుగుతుంటే.. రిటైర్ అయిన వారిని కొనసాగించడం న్యాయం కాదన్నారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, అంజి, రామలింగం, రామకృష్ణ, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment