
సాక్షి,హైదరాబాద్: డబ్బున్న కులాలు, అభ్యర్థులకే ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు ప్రాధాన్యత దక్కలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు సైతం బీసీల్లో బాగా వెనుకబడిన కులాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా వృద్ధి చెందాలంటే బీసీ రిజర్వేషన్లే ఏకైక మార్గమన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈమేరకు బీసీ కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో బీసీ మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, భూపేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment