
చంద్రబాబు మాయలో కాపులు పడొద్దు
కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు రాజ్యాంగం అనుమతించదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
యర్రగొండపాలెం టౌన్: కాపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు అన్నారు. కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 340, 15, 16 అనుమతించవని, కాపులు బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు చెప్పడం మోసం చేయడమేనన్నారు. స్థానిక రాజీవ్ అతిథి గృహంలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం సోమవారం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాదరయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. శంకరరావు మాట్లాడుతూ బీసీల్లో చేరేందుకు సాంఘిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అయి ఉండాలన్నారు.
ఆ అర్హతలను గురించి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మండల్ కేసు ఇటీవల జాట్ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చడాన్ని కొట్టి వేసిన సుప్రీంకోర్టు తీర్పు, లోగడ ఇచ్చిన అనేక తీర్పుల్లో ఈ అంశాన్ని స్పష్టం చేసిందన్నారు. తాజాగా గుజరాత్‌లో పటేళ్లను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ విషయంలో కూడా అది సాధ్యం కాదన్నారు.
అనంతరామన్, మురళీధరరావు కమిషన్‌లు ఇచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయం పరిశీలించిన పుట్టస్వామి కమిషన్, అందుకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేక పోయిందన్నారు. 20 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకు వాగ్దానం చేసిన చంద్రబాబు ఇప్పటికీ చేసిందేమీ లేదన్నారు. బీసీ సంఘం నియోజకవర్గ కోశాధికారి ఎన్ ఆత్మానంద సత్యనారాయణనాయుడు, నాయకులు ఎం మల్లికార్జునాచారి, కంచర్ల వెంకటయ్యగౌడ్, కృష్ణగౌడ్ తదితరులు మాట్లాడారు.