బీసీ సంక్షేమ సంఘం ధర్నాలో సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేశ న శంకర్‌రావు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రెడ్డప్ప, టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రకుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ బీసీల కులగణనతో మాత్రమే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారు.
బీసీలకు వైఎస్సార్‌సీపీ ప్రాధాన్యం
ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నచిన్న కులాలకు సైతం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతికి ఏపీ ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి, వారికి దశదిశ చూపించే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
బీసీలు బలమైన సామాజికవర్గమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అగ్రకులాల వారిని పల్లకిలో మోసిమోసి బీసీల భుజాలు అరిగిపోయాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి, జనగణన చేపట్టేవరకు ఏమాత్రం విశ్రమించకుండా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment