
ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి లేదు
ట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం
♦ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
♦ 7న చలో అసెంబ్లీకి అన్ని పార్టీల మద్దతు
♦ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్, బీసీలకు బడ్జెట్ కేటాయింపుల పెంపు తదితర అంశాలపై ఈనెల 7న ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారితో బీసీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సబ్‌ప్లాన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమానికి తమ వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య(కాంగ్రెస్), వన్నాల శ్రీరాములు(బీజేపీ) మాట్లాడుతూ తమ పార్టీలు 7న చేపట్టే ‘చలో అసెంబ్లీ’కి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఇతర నేతలు వకుళాభరణం కృష్ణమోహన్ రావు(కాంగ్రెస్), బొల్లం మల్ల య్య యాదవ్(టీడీపీ), పి. వెంకట్రాములు(సీపీఐ) పాల్గొన్నారు.
ఫీజు బకాయిలు సత్వరమే విడుదల చేయాలి...
ఫీజు బకాయిలు గత ఏడాది రూ.1800 కోట్లు, ఈ ఏడాదికి రూ.25 వేల కోట్లను సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లక్ష మంది విద్యార్థులతో సీఎం ఇంటి ముట్టడి చేపడుతామని హెచ్చరించారు. బీసీలకు సబ్‌ప్లాన్ పెట్టాలని, కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.