
హామీలు అమలు చేయకపోతే తిరుగుబాటే
విజయవాడ(గాంధీనగర్) : బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోతిన వెంకటమహేష్ హెచ్చరించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. బీసీ కులవృత్తిదారులు ధర్నాలో పాల్గొన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం వంటి కుల వృత్తుల చిహ్నాలను ధర్నాలో ప్రదర్శించారు. కుల వృత్తిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తిచాటారు. గంగిరెద్దులను ప్రదర్శించారు. వెంకటమహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదరణ లేక బీసీల కులవృత్తులు కనుమరుగైపోయాయన్నారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్‌కై పార్లమెంట్‌లో బిల్లుపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలని డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. ధర్నాలో బీసీ సంఘం నాయకులు తట్టి అర్జునరావు(యాదవసంఘం), పేరం శివనాగేశ్వరరావు (గౌడసంఘం), కర్రి వేణుమాధవ్ (స్వర్ణకార సంఘం), షేక్ గౌస్‌మొహిద్దీన్ (వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం), బాయన శేఖరరాబు (బీసీఐక్యవేదిక), కామరాజ్ హరీష్ (విద్యార్థి విభాగం), దాసరి సత్యం(బుడబుక్కల సంఘం), నాగేంద్ర (సూర్యబలిజ సంఘం), వివిధ కులవృత్తిదారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.