ధర్మపోరాట దీక్షలో అభివాదం చేస్తున్న ఆర్.కృష్ణయ్య. చిత్రంలో వీహెచ్, కోదండరాం తదితరులు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీ కులాలకు బీసీబంధు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీక్షను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి అనేక కులాలు రోడ్డునపడ్డాయని, వీటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఉపాధిలేక 46 మంది మనోవేదనకు గురై చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు మధుయాష్కీ, కోదండరాం, దాసోజు శ్రావణ్, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా సంఘీభావం తెలిపారు. బీసీబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లాల్‌కృష్ణ, అరుణ్‌కుమార్, జనార్దన్, నీల వెంకటేశ్, సత్యనారాయణ, అంజి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment