అధికారమే లక్ష్యంగా పోరుబాట
- ఓట్లు మావే.. సీట్లు మావే నినాదంతో ముందుకు సాగాలి
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
పీలేరు, న్యూస్‌లైన్: అధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు పోరుబాట పట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పీలేరు పట్టణంలోని వేర్‌హౌస్ గోడౌన్ ఆవరణలో సోమవారం బహుజనుల సమరభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటు అంటే తెల్లకాగితం కాదని, ఓటంటే ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి సమానమైనదని తెలిపారు.
రాజ్యాధికారం ఏ కులం చేతిలో ఉంటే ఆ కులానికి గుర్తింపు, గౌర వం ఉంటుందని తెలిపారు. అణగారిన వర్గాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే నాలుగు స్తంభాలపై పార్లమెంట్ నిలబడి ఉందని అంబేద్కర్ తెలిపారన్నారు. బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఒక గ్రంథం రాసినా ముగింపు ఉండదన్నారు. ఒకట్రెండు శాతాలు ఉన్న వారే ప్రధాని, ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పారు.
దాదాపు 90 శాతం పైగా ఉన్న బహుజనులను భిక్షగాళ్లుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాదరణను గుర్తించి రాజ్యాధికారమే లక్ష్యంగా అందరం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారం శివాజీ మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలను రాజ్యాంగం ఆశిస్తోందని, పాలక వర్గాలు ఆకలి, అశాంతి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెంచేటట్లు చేస్తున్నాయని ఆరోపించారు.
యమలా సుదర్శన్, భాస్కర్‌యాదవ్, పీటీఎం శివప్రసాద్, చమన్, విజయలక్ష్మీ, డాక్టర్ ఇక్బాల్, చింతగింజల శ్రీరామ్ తదితరులు కూడా ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు హాజరయ్యారు. పీలేరు పట్టణంలో ఆటోలతో ర్యాలీ, ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్రాస్ రోడ్డు వరకు కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార.