R.Krishnayya
-
పాత పద్ధతిలోనే ‘గ్రూప్స్’ పరీక్షలు నిర్వహించాలి
దోమలగూడ: ప్రభుత్వం గ్రూప్–1, 2, 3 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు అన్లైన్లో కాకుండా పాత పద్ధతినే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే సర్వీస్ కమిషన్ కార్యాలయన్ని ముట్టడించి చైర్మన్‌ను కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద ఏపీ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరుద్యోగులు ధర్నా చేశారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2కు మల్టీ సెషన్స్ పద్ధతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. దీని వల్ల ఐదేళ్లుగా పాత పద్ధతిలో సిద్ధమవుతున్న వారికి అన్యాయం జరుగుతుందన్నారు. సంస్కరణలు, మార్పులను రెండు, మూడేళ్ల ముందే ప్రకటించి, అభిప్రాయాలు సేకరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండున్న ఏళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయక పోవడం దారుణమైన మోసమని విమర్శించారు. ధర్నాలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాసు తదితరులు మాట్లాడారు. -
మెుదటి నుంచి అన్యాయమే..
ఓసీల పెత్తనంతోనే బీసీల వెనుకబాటు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య భూపాలపల్లి: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల పెత్తనంతోనే బీసీలు వెనుకబడిపోతున్నారని, బీసీలు పుట్టిన నాటి నుంచి పొట్టకూటి కోసం తండ్లాడటమేసరిపోతుందన్నారు. భూపాలపల్లి పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన బీసీ చైతన్య సదస్సుకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ రచన సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే న్యాయం జరిగిందని, బీసీలకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించైనా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో కేంద్రానికి తమ తడాఖా చూపుతామన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామినేటెడ్ కోటాలో ఆంగ్లో ఇండియన్‌కు సైతం పదవులు అప్పగించి చట్టసభల్లో కూర్చోబెడుతున్న ప్రభుత్వాలు బీసీలకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అగ్రకులాలు ప్రభుత్వం నుంచి వందలు, వేల కోట్ల రుణాలు తీసుకొని ఎలా ఎగ్గొట్టాలో ఆలోచిస్తే, బీసీలు రూ. లక్ష రుణం తీసుకుంటే వడ్డీ ఎంత..? తాను చెల్లించగలనా లేదా అని రోజుల తరబడి ఆలోచించేంత అమాయకులన్నారు. ఓసీలు కులాల ను చూసి ఓట్లు వేస్తుంటే బీసీలు పార్టీలను చూ సి ఓట్లు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతిని మానుకొని సర్పంచ్ నుంచి ఎంపీ స్థా యి వరకు కులాలు, పార్టీలు చూడకుండా బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచిం చారు. తోడేళ్ళను మేకల మందకు కాపలా పెడితే రోజుకో మేకను తింటుందని, ఓసీలు తోడేళ్ళ వంటి వారని, అభివృద్ధి కాగితాలకే పరి మితం అవుతుందన్నారు. తన 40 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ప్రభుత్వాలు, పార్టీలు తనను తీవ్ర ఇబ్బందులు, అవమానాలకు గురిచేశాయని, ఈ విషయాన్ని బయటకు చెప్తే అందరూ అధైర్యపడుతారనే చెప్పలేదని, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నానని కృష్ణయ్య అన్నారు. బీసీలు వ్యాపార, వాణిజ్య, విద్యా, రాజకీయ రంగాల్లో ఎదగాలని సూచించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీౖయెన సిరికొండ మధుసూదనాచారిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ సిరి కొండ ప్రదీప్, రాష్ట్ర నాయకుడు సాంబారి సమ్మారావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, నాయకులు ముంజాల రవీందర్, బుర్ర కుమారస్వామి, ఎరుకల గణపతి, పైడిపెల్లి రమేష్, కొడపాక కుమారస్వామి, దాడి మల్లయ్య, దొడ్డపెల్లి రఘుపతి, కంకటి రాజవీరు, తాటి వెంకన్న, వేముల మహేందర్, ఏరుకొండ రాజేంద్రప్రసాద్, పిల్లలమర్రి నారాయణ పాల్గొన్నారు. -
'టీడీపీనా, బీసీల సంక్షేమమా.. కృష్ణయ్యే తేల్చుకోవాలి'
అనంతపురం (గుంతకల్లు రూరల్): బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీసీ సంఘంలోనే కొనసాగాలనుకుంటే టీడీపీకి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఆ పదవికైనా రాజీనామా సమర్పించాలి. అలా కాకుండా టీడీపీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లోని బీసీలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు చెప్పగానే ఆర్.క్రిష్ణయ్య టీడీపీలో చేరారన్నారు. కనీసం ఫ్లోర్ లీడర్‌ను కూడా చేయలేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరిన కృష్ణయ్య బీసీ ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు.బీసీ సంక్షేమ సంఘంలో ఎంతో మంది ఇతర పార్టీల వారున్నారు. వారి గురించి క్రిష్ణయ్య ఏమాత్రం ఆలోచించలేదు. వారి మనోభావాలు దెబ్బతినేలా సంఘాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. తెలంగాణలోని బీసీల సమస్యలపై అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రిష్ణయ్య.. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేద’ని నిలదీశారు. ఇక్కడ బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేస్తూ ఉంటే.. క్రిష్ణయ్య వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఆటలు ఇకపై సాగనివ్వబోమన్నారు. టీడీపీ, బీసీ సంక్షేమ సంఘంలో ఏదో ఒకదానికి రాజీనామా చేయనిపక్షంలో ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ క్రిష్ణయ్య దిష్టి బొమ్మలను దహనం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి రంగస్వామి, సలహాదారుడు నాగేశ్వరరావు, సభ్యులు జగదీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలి
బీసీ కమిషన్ చైర్మన్‌కు జాతీయ నేతల విజ్ఞప్తి ఎనిమిది జాతీయ పార్టీలతో సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని బీసీ కులాలకు సమానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే జాతీయస్థాయిలో బీసీలను ఎనిమిది గ్రూపులుగా వర్గీకరించాలని, అప్పుడే 27 శాతం రిజర్వేషన్లో అందరికీ న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు బుధవారం విజ్ఞప్తిచేశారు. బీసీల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జాబితాలో ఉన్న అన్ని కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని వారు విన్నవిం చారు. 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు. ‘కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఏబీసీడీ వర్గాలుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో లేరు. కేంద్రం అమలుచేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వర్గీకరణ లేకపోవడం మూలంగా బీసీల్లోని అత్యంత వెనకబడిన కులాలకు, సంచార జాతులకు అన్యాయం జరుగుతోంది. అన్ని రాష్ట్రాల కులాలను ఎనిమిది గ్రూపులుగా వర్గీకరించాలి’ అని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు. బీసీలను మూడు గ్రూపులుగా వర్గీకరించే ఆలోచన కమిషన్ పరిశీలనలో ఉందని ఈశ్వరయ్య హామీ ఇచ్చినట్టు తెలిపారు. పార్లమెంటులో బీసీల గొంతు వినిపించండి పార్లమెంటులో బీసీల బిల్లు ప్రవేశపెట్టాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, తదితర అంశాలను దేశంలోని 60 కోట్ల మంది బీసీల పక్షాన ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో 20 మంది ప్రతినిధుల బృందం పార్లమెంటులో ఎనిమిది జాతీయ పార్టీల పార్లమెంటరీ నేతలను కలిసి విన్నవించింది. లోక్‌సభలో ఏఐడీఎంకే ఫ్లోర్‌లీడర్ డాక్టర్ పి.వేణుగోపాల్, బిజూ జనతాదళ్ పక్ష నేత భర్తృహరి మెహతా, టీడీపీ పక్ష నేత తోట నర్సిం హులు, రాజ్యసభలో టీడీపీ పక్ష నేత టి.దేవేందర్‌గౌడ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తదితర నేతలను, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎస్ఏడీ నేతలను కలిసి ఈ అంశాలపై చర్చించినట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు. వీరంతా బీసీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు, బోళ్ల కరుణాకర్, శారద, సి.రాజేందర్, పి.లక్ష్మీనారాయణ, పెరిక సురేష్ పాల్గొన్నారు. -
28న బీసీ విద్యార్థుల మహాగర్జన: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మొత్తం చెల్లించాలని, పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని, ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను రూ. రెండు వేలకు పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న బీసీ విద్యార్థుల మహాగర్జనను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలి పారు. విద్యా సంవత్సరం మొదలై ఆరునెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ‘ఫాస్ట్’ కమిటీని వేసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదన్నారు. -
చదువులకు ఆటంకం కలిగించొద్దు: ఆర్.కృష్ణయ్య
విజయనగర్‌కాలనీ: బీసీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవకుండా అడ్డంకులు సృష్టించడం తగదని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పూర్తి ఫీజులతో రీయింబర్స్మెంట్ పథకం కొనసాగించకుంటే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా చదువులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కావాలనే ప్రభుత్వం 170 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేసి బీసీ యువకుల చదువుకు ఆటంకాలు కల్పించిందన్నారు. ఈ విషయంపై బీసీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు నోరెత్తడం లేదని ఆయన అన్నారు. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాలేజి విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు, ఫీజుల రీయంబర్స్మెంట్ విధించిన గరిష్ట ఆదాయ పరిమితిని రెండు లక్షలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అలోక్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు విక్రమ్‌గౌడ్, ఎన్.వెంకటేష్, వంశీ, శివాజీ, గొరిగె మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి
ఆర్.కృష్ణయ్య పిలుపు ముషీరాబాద్ : ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెకు బీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బీసీ ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ఎ.రమేష్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాం గ బద్ధమైన కమిషన్ల సిఫార్సులు చేసిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకుండా గత ప్రభుత్వాలు తొక్కి పెట్టాయన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాకపోతే దేశంలోని ప్రతి బీసీ ఉద్యోగి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నడుం బిగించాలని కోరారు. రెండు రాష్ట్రాలకు అడ్‌హక్ కమిటీల ఏర్పాటు బీసీ ఉపాధ్యాయ సంఘాన్ని నిర్మాణ పరంగా బలోపేతం చేసి బీసీ ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసేందుకు రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.రమేష్‌బాబు, తెలంగాణ రాష్ట్రానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన డాన్ అర్నాల్డ్‌ను ఎన్నుకున్నారు. నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడలో బీసీ ఉపాధ్యాయ సంఘం రెండు రాష్ట్రాల బహిరంగ సభలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తామన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు దుర్భరం కవాడిగూడ: ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న సుమారు రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. -
‘దేశం’ హుషారు
సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ఫలితాలు గ్రేటర్‌లోని ‘దేశం’ శ్రేణులకు కొత్త హుషారునిచ్చాయి. పార్టీ నేతలు, క్యాడర్ సైతం ఊహించని విధంగా నగరంలో మూడు స్థానాల్లో.. శివార్లలో ఆరు స్థానాల్లో వెరసి గ్రేటర్‌లోని 9 స్థానాల్లో ఓటర్లు టీడీపీని గెలిపించారు. టికెట్ల కేటాయింపుల వరకు తీవ్ర అసమ్మతులు, అసంతృప్తులతో తల్లడిల్లిన టీడీపీకి బీజేపీతో పొత్తు కలిసి వచ్చింది. ‘మోడీ’ ఫ్యాక్టర్ తారకమంత్రంలా పనిచేసింది. అభ్యర్థులను పార్టీ నేతలు పట్టించుకోకున్నా.. వారి నుంచి ఆశించిన స్థాయిలో సహాయ, సహకారాలు లేకున్నా ప్రజలు మద్దతు పలికారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న క్షేత్రస్థాయిలోని క్యాడర్ పార్టీ కోసం పనిచేసింది. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలనే తలంపుతో టీడీపీ-బీజేపీ కూటమికి జై కొట్టారు. గ్రేటర్లో పార్టీని పెద్దనాయకులు పట్టించుకోకున్నా ప్రజలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం గమనార్హం. జీహెచ్ఎంసీలో టీడీపీ ఇంతటి ప్రాధాన్యాన్ని సాధించడం ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లా నుంచి ఒక్క స్థానాన్ని కూడా సాధించలేని టీడీపీ ఈసారి ఏకంగా మూడుసీట్లు గెలుచుకుంది. అలాగే గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో రాజేంద్రనగర్ సీటు మాత్రమే గెలిచిన టీడీపీ.. ఈసారి దాంతోపాటు మరో ఐదు స్థానాల్లో గెలిచింది. వెరసి గ్రేటర్లో మొత్తం 9 స్థానాల్లో టీడీపీ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇక సైకిల్ స్పీడుకు తిరుగే లేదని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. -
'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీసీ నినాదం మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వీహెచ్ ఆరోపించారు. శనివారం వీహెచ్ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం అంటున్న చంద్రబాబు అదే నినాదాన్ని సీమాంధ్రలో ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలోని బీసీలు టీడీపీకి మద్దతు పలికినా వారికి సీట్లు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దాంతో బీసీలపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటితో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాటలతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దారి తప్పారని వీహెచ్ అన్నారు. ఆ విషయాన్ని గ్రహించాలని ఆర్.కృష్ణయ్యకు వీహెచ్ హితవు పలికారు. టీడీపీలో బీసీలకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వరని ఆయన గుర్తు చేశారు. గత అనుభవాలే అందుకు నిదర్శనమని వీహెచ్ ఆరోపించారు. డబ్బు, పదవులు ఎర వేసి చంద్రబాబు బీసీ నేతలను వాడుకుంటున్నారని విమర్శించారు. -
అధికారమే లక్ష్యంగా పోరుబాట
ఓట్లు మావే.. సీట్లు మావే నినాదంతో ముందుకు సాగాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పీలేరు, న్యూస్‌లైన్: అధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు పోరుబాట పట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పీలేరు పట్టణంలోని వేర్‌హౌస్ గోడౌన్ ఆవరణలో సోమవారం బహుజనుల సమరభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటు అంటే తెల్లకాగితం కాదని, ఓటంటే ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి సమానమైనదని తెలిపారు. రాజ్యాధికారం ఏ కులం చేతిలో ఉంటే ఆ కులానికి గుర్తింపు, గౌర వం ఉంటుందని తెలిపారు. అణగారిన వర్గాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే నాలుగు స్తంభాలపై పార్లమెంట్ నిలబడి ఉందని అంబేద్కర్ తెలిపారన్నారు. బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఒక గ్రంథం రాసినా ముగింపు ఉండదన్నారు. ఒకట్రెండు శాతాలు ఉన్న వారే ప్రధాని, ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పారు. దాదాపు 90 శాతం పైగా ఉన్న బహుజనులను భిక్షగాళ్లుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాదరణను గుర్తించి రాజ్యాధికారమే లక్ష్యంగా అందరం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారం శివాజీ మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలను రాజ్యాంగం ఆశిస్తోందని, పాలక వర్గాలు ఆకలి, అశాంతి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెంచేటట్లు చేస్తున్నాయని ఆరోపించారు. యమలా సుదర్శన్, భాస్కర్‌యాదవ్, పీటీఎం శివప్రసాద్, చమన్, విజయలక్ష్మీ, డాక్టర్ ఇక్బాల్, చింతగింజల శ్రీరామ్ తదితరులు కూడా ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు హాజరయ్యారు. పీలేరు పట్టణంలో ఆటోలతో ర్యాలీ, ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్రాస్ రోడ్డు వరకు కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార. -
సీల్డ్ కవర్ సీఎం: ఆర్.కృష్ణయ్య
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ సీల్డ్ కవర్లో వచ్చిన సీఎం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో బీసీ ఆదిలాబాద్ తాలుకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి, నూతనంగా ఎన్నికైన తాలుకా బీసీ సర్పంచుల ఆత్మీయ సన్మాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ర్ట జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఉంటే, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో 22 శాతానికి తగ్గించడానికి సీఎం కిరణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్పంచ్‌లకు నెలకు రూ.20వేలు ఇవ్వాలి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీసీ సర్పంచులే ఎన్నికయ్యారని పేర్కొన్నారు. అం దుకే ప్రభుత్వం సర్పంచ్, కార్యదర్శులకు జా యింట్ చెక్‌పవర్ ఇచ్చి పరోక్షంగా బీసీ సర్పంచులకు రాజ్యాధికారం లేకుండా చేశారని మండిపడ్డారు. సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు లక్షల్లో వేతనాలు కుమ్మరిస్తూ.. సర్పంచులకు చాలీచాలని జీతం అందిస్తున్నారని విమర్శించారు. సర్పంచులకు నెలకు రూ.20 వేలు, వార్డు సభ్యులకు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించే వరకూ పోరాడుతామని వివరించారు. పది రోజుల్లో సర్పంచులకు చెక్‌పవర్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీల సత్తా చూపుతామని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తేనే రాజ్యాధికారం దక్కుతుందని స్పష్టం చేశారు. బీసీల ఓటు బ్యాంకుతోనే పార్టీలు గట్టెక్కుతున్నాయని, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. అగ్రవర్ణాలది ఆకలి పోరాటం అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలది ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. చట్టసభల్లో 50 శాతంరిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దామాషా ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు, రాజ్యసభ స్థానాలు కేటాయించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్సమెంట్, ఉపకార వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బీసీ సర్పంచులను సన్మానించి.. జ్ఞాపికలు అందించారు. అంతకు ముందు మండలంలోని మావల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీ నుంచి కృష్ణయ్యను బీసీ సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించి సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన్ను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ప్రముఖ కళాకారులు రమేష్, సమ్మయ్య, నల్గొండకు చెందిన సోమన్న పాటలు పాడి ఆహూతులను ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న, బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్‌గౌడ్, ఓయూ బీసీ సంఘం నేత దత్తాత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్, టీడీపీ ఇన్చార్జి పాయల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు, రాజకీయ జేఏసీ చైర్మన్ మహేంద్రనాథ్ యాదవ్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు అశోక్, బీసీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ తాలుకా అధ్యక్ష, ప్రధానƒ కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారధి, కోశాధికారి దేవీసింగ్, గౌరవాధ్యక్షుడు లింగన్న, వై.రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.