చదువులకు ఆటంకం కలిగించొద్దు: ఆర్.కృష్ణయ్య
విజయనగర్‌కాలనీ: బీసీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవకుండా అడ్డంకులు సృష్టించడం తగదని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పూర్తి ఫీజులతో రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగించకుంటే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ భవన్‌ను ముట్టడించారు.
తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా చదువులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కావాలనే ప్రభుత్వం 170 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేసి బీసీ యువకుల చదువుకు ఆటంకాలు కల్పించిందన్నారు. ఈ విషయంపై బీసీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు నోరెత్తడం లేదని ఆయన అన్నారు.
బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాలేజి విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు, ఫీజుల రీయంబర్స్‌మెంట్ విధించిన గరిష్ట ఆదాయ పరిమితిని రెండు లక్షలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అలోక్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు విక్రమ్‌గౌడ్, ఎన్.వెంకటేష్, వంశీ, శివాజీ, గొరిగె మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.