సీల్డ్ కవర్‌ సీఎం: ఆర్‌.కృష్ణయ్య | Sealed Cover CM says R.Krishnayya | Sakshi
Sakshi News home page

సీల్డ్ కవర్‌ సీఎం: ఆర్‌.కృష్ణయ్య

Published Sat, Oct 12 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ సీల్డ్ కవర్‌లో వచ్చిన సీఎం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

ఆదిలాబాద్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌  సీల్డ్ కవర్‌లో వచ్చిన సీఎం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో బీసీ ఆదిలాబాద్‌ తాలుకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి, నూతనంగా ఎన్నికైన తాలుకా బీసీ సర్పంచుల ఆత్మీయ సన్మాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ర్ట జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ ఉంటే, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో 22 శాతానికి తగ్గించడానికి సీఎం కిరణ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్‌ శాతాన్ని తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సర్పంచ్‌లకు నెలకు రూ.20వేలు ఇవ్వాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీసీ సర్పంచులే ఎన్నికయ్యారని పేర్కొన్నారు. అం దుకే ప్రభుత్వం సర్పంచ్‌, కార్యదర్శులకు జా యింట్‌ చెక్‌పవర్‌ ఇచ్చి పరోక్షంగా బీసీ సర్పంచులకు రాజ్యాధికారం లేకుండా చేశారని మండిపడ్డారు. సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు లక్షల్లో వేతనాలు కుమ్మరిస్తూ.. సర్పంచులకు చాలీచాలని జీతం అందిస్తున్నారని విమర్శించారు. సర్పంచులకు నెలకు రూ.20 వేలు, వార్డు సభ్యులకు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించే వరకూ పోరాడుతామని వివరించారు. పది రోజుల్లో సర్పంచులకు చెక్‌పవర్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే బీసీల సత్తా చూపుతామని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తేనే రాజ్యాధికారం దక్కుతుందని స్పష్టం చేశారు. బీసీల ఓటు బ్యాంకుతోనే పార్టీలు గట్టెక్కుతున్నాయని, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. అగ్రవర్ణాలది ఆకలి పోరాటం అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలది ఆత్మగౌరవ పోరాటమని అన్నారు.

చట్టసభల్లో 50 శాతంరిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. దామాషా ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు, రాజ్యసభ స్థానాలు కేటాయించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్‌‌సమెంట్‌, ఉపకార వేతనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బీసీ సర్పంచులను సన్మానించి.. జ్ఞాపికలు అందించారు. అంతకు ముందు మండలంలోని మావల మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌ కాలనీ నుంచి కృష్ణయ్యను బీసీ సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.

పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించి సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన్ను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ప్రముఖ కళాకారులు రమేష్‌, సమ్మయ్య, నల్గొండకు చెందిన సోమన్న పాటలు పాడి ఆహూతులను ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న, బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్‌గౌడ్‌, ఓయూ బీసీ సంఘం నేత దత్తాత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌, టీడీపీ ఇన్‌చార్జి పాయల శంకర్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు, రాజకీయ జేఏసీ చైర్మన్‌ మహేంద్రనాథ్‌ యాదవ్‌, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు అశోక్‌, బీసీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్‌ తాలుకా అధ్యక్ష, ప్రధానƒ కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారధి, కోశాధికారి దేవీసింగ్‌, గౌరవాధ్యక్షుడు లింగన్న, వై.రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement