అనంతపురం (గుంతకల్లు రూరల్): బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీసీ సంఘంలోనే కొనసాగాలనుకుంటే టీడీపీకి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఆ పదవికైనా రాజీనామా సమర్పించాలి. అలా కాకుండా టీడీపీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లోని బీసీలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు చెప్పగానే ఆర్.క్రిష్ణయ్య టీడీపీలో చేరారన్నారు. కనీసం ఫ్లోర్ లీడర్‌ను కూడా చేయలేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరిన కృష్ణయ్య బీసీ ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు.బీసీ సంక్షేమ సంఘంలో ఎంతో మంది ఇతర పార్టీల వారున్నారు. వారి గురించి క్రిష్ణయ్య ఏమాత్రం ఆలోచించలేదు. వారి మనోభావాలు దెబ్బతినేలా సంఘాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. తెలంగాణలోని బీసీల సమస్యలపై అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రిష్ణయ్య.. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేద’ని నిలదీశారు. ఇక్కడ బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేస్తూ ఉంటే.. క్రిష్ణయ్య వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఆటలు ఇకపై సాగనివ్వబోమన్నారు. టీడీపీ, బీసీ సంక్షేమ సంఘంలో ఏదో ఒకదానికి రాజీనామా చేయనిపక్షంలో ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ క్రిష్ణయ్య దిష్టి బొమ్మలను దహనం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి రంగస్వామి, సలహాదారుడు నాగేశ్వరరావు, సభ్యులు జగదీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.