derangula uday kiran
-
టీడీపీకి ఉలికిపాటు ఎందుకు?: ఉదయ్ కిరణ్
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు నిర్వహిస్తే టీడీపీకి ఉలికిపాటు ఎందుకని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు డేరంగుల ఉదయ్ కిరణ్ సూటిగా ప్రశ్నించారు. నాంపల్లిలోని హోటల్‌రాజ్ ఇంటర్నేషనల్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేసే అధికారం సీఎస్‌కు ఉందన్నారు. ఎన్నికల కౌంటింగ్‌పై సీఎస్ మాట్లాడితే తప్పేమిటని అన్నారు. ఎన్నికల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే మాట్లాడాలా.? సీఎస్‌కు మాట్లాడే అధికారం లేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే టీడీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి చేసి అక్రమ మార్గంలో పనులను చక్కబెట్టుకుంటున్నట్లు విమర్శించారు. మాజీలయిప్పటికీ అధికారం చలాయించాలనే భ్రమలో టీడీపీ నాయకులు ఉండటం సిగ్గుచేటన్నారు. సీఎస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్రులకు సీట్లు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులకు 20 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలను రాసినట్లు వివరించారు. బుధవారం నాంపల్లిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది మంది సీమాంధ్రులు స్థిరపడినట్లు వివరించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా పన్నుల రూపంలో సీమాంధ్రులు ఆదాయాన్ని సమకూర్చుతున్నప్పటికీ అధికారంలో భాగస్వామ్యం లేకుండా పోయిందన్నారు. సీమాంధ్ర నుంచి తెలంగాణలో సరైన ప్రజాప్రతినిధి లేకపోవడంతోనే వీరి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. -
చంద్రబాబుకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది!
కర్నూలు జిల్లా: గత ఎన్నికల్లో ఎస్టీ జాబితాలోకి చేరుస్తానని మాట ఇచ్చి మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వాల్మీకీలు బుద్ది చెప్పే సమయం వచ్చిందని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆలూరులో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయాల చరిత్ర మార్చేది బీసీలేనని, అలాంటి తమని చంద్రబాబు విస్మరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రానున్న ఎన్నికలలో తమని గుర్తుంచకపోతే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఒక ప్రాంతంలోని 5 జిల్లాలో వాల్మీకులను ఎస్టీలుగాపెట్టి మిగతా 8 జిల్లాలో బీసీల జాబితాలో ఉంచడం చాలా దారుణమన్నారు. -
‘ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటాం’
నాంపల్లి(హైదరాబాద్‌సిటీ): కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేయనున్న పాదయాత్రను అడ్డుకుంటామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డేరంగుల ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. ఆదివారం నాంపల్లిలోని ఓ హోటల్లో ఏపీ బీసీ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డేరంగుల ఉదయ్ కిరణ్ ప్రసంగిస్తూ... కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తే తమకేమి ఇబ్బంది లేదన్నారు. కానీ బీసీ జాబితాలో కాపులను చేర్చాలని కోరితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం ఎక్కడ పాదయాత్రను ప్రారంభించినా బీసీ సంఘాలన్నీ సంఘటితంగా ప్రతిఘటిస్తాయని తెలిపారు. కాబట్టి పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. లేదంటే ముద్రగడ పద్మనాభం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత ఏడాది జనవరిలో ముద్రగడ చేసిన ఆందోళనలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పటించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేశారని వివరించారు. ఈ ఘటనకు కారణమైన ముద్రగడ పద్మనాభంపై కేసు నమోదు చేశారే తప్ప చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటు కాపులను, ఇటు బీసీలను మభ్యపెడుతున్నారే తప్ప ఏ ఒక్కరికి స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ద్వంద వైఖరితో పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. బాబుపాలనలో ప్రజా సంక్షేమం పడకేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, చంద్రబాబు అబద్దాలను ప్రజలు మళ్లీ నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడి కామాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఏరూరు రంగస్వామి, వడ్డెర సేన రాష్ట్ర కార్యదర్శి మనోజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు జగదీష్, రాఘవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘జన్మభూమి’తో ప్రజలకు ఒరిగిందేమి లేదు
గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో పేదలకు ఒరిగిందేమి లేదని, ఊకదంపుడు ఉపన్యాస్యాలు తప్ప సమస్యల పరిష్కారం శూన్యమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. టీడీపీకి బీసీలు వెన్నెమొక అని చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వడ్డెర, వాల్మీకి, రజక, బెస్త, మేదర తదితర కులాలను ఎస్టీల్లో చేరుస్తానని, రూ.10 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చనపుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారని విశ్వసించాలని ఆయన ప్రశ్నించారు. -
పవన్ కల్యాణ్ పై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్ : కుల మతాలను కించపరిచే విధంగా తిరుపతి సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తాను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా తిరస్కరించారని ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుల మతాల పేరు చెబితే అరికాళ్ల నుంచి మంటపుడుతుందని ప్రత్యక్షంగా సభలో మాట్లాడటం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
'జనసేన పార్టీని రద్దు చేయాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా, సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఆందోళన చెందుతుంటే జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ప్రశ్నించారు. ప్రజలకు, అభిమానులకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ సమయంలో గొప్పలు చెప్పిన పవన్ కల్యాణ్ అధికారపక్షంపై పల్లెత్తుమాటైనా వ్యాఖ్యానించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఉన్నందున జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ చే శారు. పవన్ ఎక్కడున్నాడంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కట్టుకున్న భార్యకు, పుట్టిన బిడ్డకు న్యాయం చేయని పవన్ ప్రజలకు ఏమి చేస్తాడని ఎద్దేవా చేశారు. -
'ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదు'
- ఏపీ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు డేరంగుల హైదరాబాద్‌సిటీ: ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా పోలీసులు తనకు భద్రత కల్పించడం లేదని, కేంద్ర ఇంటెలిజెన్స్ నుండి భద్రతరిత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా ఇంతవరకూ ఏపీ ప్రభుత్వం ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదని ఆంధ్రరప్రదేశ్ బీసీ సంఘం అద్యక్షుడు డేరెంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. ఆదివారం ఎర్రగడ్డలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సామాజికవర్గ ప్రజలకోసం పోరాడుతున్న తనకు అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తన కుటుంబానికి హాని తలపెట్టడానికి యత్నిస్తున్నారని ఓ లేఖలో మానవహక్కుల సంఘానికి, ఏపీ డీజీపీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విచారణ చేపట్టాలంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆదేశాలు వావడంతో జీర్ణించుకోలేని కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. విచారణకు న్యాయబద్దంగా, చిత్తశుద్దిగా చేయాలని డిమాండ్ చేశారు. భాద్యతాయుతంగా, సామాజికవర్గ ప్రజల కోసం పోరాడితే కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మరి రాష్ట్రంలో రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నుండి భద్రతను ఇవ్వాలని వివరించినా ఇంతవరకూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తనకు, నా కుటుంబానికి ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. భద్రతను ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు. -
నాకు హాని జరిగితే ఏపీ పోలీసులదే బాధ్యత
బంజారాహిల్స్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజ్యాంగ హక్కులను కాపాడాలని పోరాడుతున్న తనకు ప్రాణహాని ఉందని తనకు ఏదైనా జరిగితే ఏపీ పోలీసులదే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లో విలేకరులతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు పోరాడుతున్న తనకు ముప్పు ఉందని, కొందరు దుండగులు తన కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై కేంద్ర హోంసెక్రటరీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఏపీ సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీల అమలు మర్చిపోయి ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రావణ రాజ్యం కొనసాగుతున్నదన్నారు. అరాచకాలు పెట్రేగిపోతున్నాయని హక్కులకు విలువ లేకుండా పోయిందన్నారు. -
'బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చలేదు'
అనంతపురం(గుంతకల్లు): బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్‌కు ఏపీ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హమీలు ఇచ్చినా వాటిలో ఇంతవరకు ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీలనే న్యాయనిర్ణేతలుగా ప్రకటిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలను ప్రజా బ్యాలెట్‌గా ముద్రించి ఈనెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరుల ముందుకు తీసుకువెళ్లామన్నారు. ప్రజా బ్యాలెట్‌ను విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే విశేష స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ముఖ్యంగా గాండ్ల, ఉప్పర, పూసల, పద్మశాలి, నాయీబ్రాహ్మణ, దూదేకుల, కుమ్మర వర్గాలకు చెందిన వారు పూర్తిగా మోసపోయారన్నారు. అలాంటి వారంతా ప్రజాబ్యాలెట్లో విస్తృతంగా పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసేవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. -
సమరదీక్షకు బీసీలు తరలిరావాలి
పట్నంబజారు(గుంటూరు): ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజా గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సమరదీక్షకు బలహీన వర్గాలు మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్, వెనుకబడిన తరగతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పిలుపునిచ్చారు. సమరదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం గుంటూరులో విలేకర్లతో మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో వడ్డెర, వాల్మీకి, బెస్త కులాల వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని, బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్న మాటలు నీటిమీద రాతలుగా మిగిలిపోయాయని విమర్శించారు. బీసీల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, ఆయన చేపట్టిన సమరదీక్షను జయప్రదం చేసేందుకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. జగన్‌కు మద్దతుగా నిలుస్తామనే ఉద్దేశంతో టీడీపీ నేతలు, తనపై దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
'టీడీపీనా, బీసీల సంక్షేమమా.. కృష్ణయ్యే తేల్చుకోవాలి'
అనంతపురం (గుంతకల్లు రూరల్): బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీసీ సంఘంలోనే కొనసాగాలనుకుంటే టీడీపీకి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఆ పదవికైనా రాజీనామా సమర్పించాలి. అలా కాకుండా టీడీపీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లోని బీసీలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు చెప్పగానే ఆర్.క్రిష్ణయ్య టీడీపీలో చేరారన్నారు. కనీసం ఫ్లోర్ లీడర్‌ను కూడా చేయలేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరిన కృష్ణయ్య బీసీ ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు.బీసీ సంక్షేమ సంఘంలో ఎంతో మంది ఇతర పార్టీల వారున్నారు. వారి గురించి క్రిష్ణయ్య ఏమాత్రం ఆలోచించలేదు. వారి మనోభావాలు దెబ్బతినేలా సంఘాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. తెలంగాణలోని బీసీల సమస్యలపై అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రిష్ణయ్య.. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేద’ని నిలదీశారు. ఇక్కడ బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేస్తూ ఉంటే.. క్రిష్ణయ్య వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఆటలు ఇకపై సాగనివ్వబోమన్నారు. టీడీపీ, బీసీ సంక్షేమ సంఘంలో ఏదో ఒకదానికి రాజీనామా చేయనిపక్షంలో ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ క్రిష్ణయ్య దిష్టి బొమ్మలను దహనం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి రంగస్వామి, సలహాదారుడు నాగేశ్వరరావు, సభ్యులు జగదీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.