సమరదీక్షకు బీసీలు తరలిరావాలి
పట్నంబజారు(గుంటూరు): ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజా గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సమరదీక్షకు బలహీన వర్గాలు మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్, వెనుకబడిన తరగతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పిలుపునిచ్చారు. సమరదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం గుంటూరులో విలేకర్లతో మాట్లాడారు.
బీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో వడ్డెర, వాల్మీకి, బెస్త కులాల వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని, బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్న మాటలు నీటిమీద రాతలుగా మిగిలిపోయాయని విమర్శించారు.
బీసీల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, ఆయన చేపట్టిన సమరదీక్షను జయప్రదం చేసేందుకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. జగన్‌కు మద్దతుగా నిలుస్తామనే ఉద్దేశంతో టీడీపీ నేతలు, తనపై దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.