దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి
- ఆర్.కృష్ణయ్య పిలుపు
ముషీరాబాద్ : ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెకు బీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ఎ.రమేష్‌బాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాం గ బద్ధమైన కమిషన్ల సిఫార్సులు చేసిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకుండా గత ప్రభుత్వాలు తొక్కి పెట్టాయన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాకపోతే దేశంలోని ప్రతి బీసీ ఉద్యోగి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నడుం బిగించాలని కోరారు.
రెండు రాష్ట్రాలకు అడ్‌హక్ కమిటీల ఏర్పాటు
బీసీ ఉపాధ్యాయ సంఘాన్ని నిర్మాణ పరంగా బలోపేతం చేసి బీసీ ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసేందుకు రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.రమేష్‌బాబు, తెలంగాణ రాష్ట్రానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన డాన్ అర్నాల్డ్‌ను ఎన్నుకున్నారు. నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడలో బీసీ ఉపాధ్యాయ సంఘం రెండు రాష్ట్రాల బహిరంగ సభలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తామన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు దుర్భరం
కవాడిగూడ: ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న సుమారు రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు.