తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ | OBC Sub Categorisation May Conclude Soon | Sakshi
Sakshi News home page

తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ

Published Wed, Feb 17 2021 3:45 AM | Last Updated on Wed, Feb 17 2021 8:38 AM

OBC Sub Categorisation May Conclude Soon  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్‌ ఆయా కులాల మధ్య రిజర్వేషన్లను దామాషా ప్రకారం పంచేందుకు వాటిని నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదిస్తూ ముసాయిదా నివేదిక రూపొందించింది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా మార్చి నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ.. వరుసగా 2, 6, 9, 10 శాతం రిజర్వే షన్లను పంపిణీ చేస్తూ కమిషన్‌ ప్రతిపాదించి నట్టు సమాచారం. రిజర్వేషన్‌ ఫలాలు పొందని, అత్యంత వెనబడిన కులాలను మొదటి కేటగిరీలో పొందు పరిచినట్టు తెలుస్తోంది. నాలుగో కేటగిరీలో 97 కులాలు మాత్రమే ఉన్నప్పటికీ... జనాభా పరంగా చూస్తే సింహభాగం వారే ఉన్నారు. కాబట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లలో జనాభా ప్రాతిప దికన అత్యధికంగా 10% వారికే దక్కనుందని సమా చారం. 4వ కేటగిరీలో సామాజికంగా బలమైన, అత్యంత ప్రభావవంతమైన కులాలున్నాయి. గతం లోనూ ఈ కులాలే రిజర్వేషన్ల ఫలాలు అధికంగా పొందినప్పటికీ... జనాభా నిష్పత్తికి మించి వీరికి ప్రయోజనం కలిగిందనేది ఇతరుల అభ్యంతరం.

మొదటి కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328, నాలుగో కేటగిరీలో 97 కులాలు పొందుపరిచినట్టు సమాచారం. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాలకు ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, ఓబీసీల్లో అత్యంత వెనకబడిన కులాలకు రిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదంటూ బీసీ సంక్షేమ సంఘాల డిమాండ్లు, జాతీయ బీసీ కమిషన్‌ సిఫారసులు, స్థాయీ సంఘాల సిఫారసుల నేపథ్యంలో 2017 అక్టోబరు 2వ తేదీన ఈ కమిషన్‌ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్‌ అదే ఏడాది అక్టోబరు 10 నుంచి తన పని ప్రారంభించింది. ఈ కమిషన్‌ 12 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు కేంద్ర మంత్రిమండలి ఈ కమిషన్‌ గడువు పొడిగించింది. ప్రస్తుతం 2021 జూలై 31కి నివేదిక ఇవ్వాల్సి ఉంది.

ఈ కమిషన్‌ నాలుగు విధి విధానాల ఆధారంగా నివేదిక సమ ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితాలో చేర్చిన ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్‌ ప్రయోజనాల పంపిణీలో అసమానతలు పరిశీలించడం, ఓబీసీ కులాల ఉప వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో నిబంధనలు రూపొందించడం, కేంద్ర జాబితాలో ఓబీసీలను ఉపకులాల వారీగా వర్గీకరించడం, కేంద్ర జాబితాలోని వివిధ ఎంట్రీలను అధ్యయనం చేసి అక్షర దోషాలు, పునరావృతులు, అస్పష్టతలు, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం.. తదితరæ నాలుగు విధివిధానాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్‌ నివేదిక సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాల్లో... రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందని ఓబీసీ కులాలకు.. ఈ కమిషన్‌ సిఫారసులను అమలు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఓబీసీ జాబితాలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కమిషన్‌ సిఫారసులు చేస్తుంది.

సున్నితమైన అంశం... రాజకీయంగా ప్రాధాన్యత
ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్లలో కొన్ని కులాలకే లబ్ధి చేకూరినట్టు కమిషన్‌ విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన వాటిలో 97% మేర విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకే దక్కాయని, ఇందులో 24.95% ఉద్యోగాలు కేవలం 10 ఓబీసీ కులాలకే దక్కాయని, దాదాపు 983 కులాలకు (అంటే 37%) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిందని కమిషన్‌ విశ్లేషించినట్టు తెలుస్తోంది. 994 ఓబీసీ కులాలకు 2.68% మేర కోర్సుల్లో సీట్లు, ఉద్యోగాలు దక్కినట్టు సమాచారం. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్‌ తనకు అప్పగించిన విధివిధానాల మేరకు ఆయా అసమానతలను తొలగించాల్సి ఉన్నందున.. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందిన కులాలను చివరి కేటగిరీలో చేర్చాల్సి వస్తుందని అంచనా. దేశంలో రాజకీయా లపై కులాల ప్రభావం ఎక్కువ ఉంటున్నందున.. రిజర్వేషన్లు తగ్గితే అధిక ప్రాబల్యం ఉన్న కులాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు ఉండనున్నందున అలాంటి సమస్య తలె త్తదని, ఇప్పటివరకు రిజర్వేషన్‌ ఫలాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, తాము లేవనెత్తిన అంశాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు.

సమాచారాన్ని విశ్లేషించిన కమిషన్
11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ అమలవుతోంది. అయితే ఆ వర్గీకరణ రాష్ట్ర జాబితాలోని కులాలకు రాష్ట్రస్థాయిలో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ జాతీయస్థాయి కమిషన్‌ కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలతో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో ఈ కమిషన్‌ చర్చించింది. ఉన్నత విద్య కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన సమాచా రాన్ని, ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీలకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్‌ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటివరకు రిజర్వేషన్‌ పంపిణీలో చోటు చేసుకున్న అసమానతలను విశ్లేషించింది. సంబంధిత సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దానిని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు సమయం అవసరమైంది. అలాగే లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడం ఆలస్యమైంది. వీటన్నింటినీ విశ్లేషించి, ముసాయిదాను రూపొందించిన కమిషన్‌ తన ప్రతిపాదనలపై వచ్చే నెల నుంచి రాష్ట్రాలు, ఓబీసీ కులాలు, సంబంధిత అంశంలో భాగస్వాములందరితో చర్చించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement