‘దేశం’ హుషారు
సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ఫలితాలు గ్రేటర్‌లోని ‘దేశం’ శ్రేణులకు కొత్త హుషారునిచ్చాయి. పార్టీ నేతలు, క్యాడర్ సైతం ఊహించని విధంగా నగరంలో మూడు స్థానాల్లో.. శివార్లలో ఆరు స్థానాల్లో వెరసి గ్రేటర్‌లోని 9 స్థానాల్లో ఓటర్లు టీడీపీని గెలిపించారు. టికెట్ల కేటాయింపుల వరకు తీవ్ర అసమ్మతులు, అసంతృప్తులతో తల్లడిల్లిన టీడీపీకి బీజేపీతో పొత్తు కలిసి వచ్చింది.
‘మోడీ’ ఫ్యాక్టర్ తారకమంత్రంలా పనిచేసింది. అభ్యర్థులను పార్టీ నేతలు పట్టించుకోకున్నా.. వారి నుంచి ఆశించిన స్థాయిలో సహాయ, సహకారాలు లేకున్నా ప్రజలు మద్దతు పలికారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న క్షేత్రస్థాయిలోని క్యాడర్ పార్టీ కోసం పనిచేసింది. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలనే తలంపుతో టీడీపీ-బీజేపీ కూటమికి జై కొట్టారు. గ్రేటర్‌లో పార్టీని పెద్దనాయకులు పట్టించుకోకున్నా ప్రజలు తమ పెద్ద మనసును చాటుకున్నారు.
సికింద్రాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీలో టీడీపీ ఇంతటి ప్రాధాన్యాన్ని సాధించడం ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లా నుంచి ఒక్క స్థానాన్ని కూడా సాధించలేని టీడీపీ ఈసారి ఏకంగా మూడుసీట్లు గెలుచుకుంది.
అలాగే గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో రాజేంద్రనగర్ సీటు మాత్రమే గెలిచిన టీడీపీ.. ఈసారి దాంతోపాటు మరో ఐదు స్థానాల్లో గెలిచింది. వెరసి గ్రేటర్‌లో మొత్తం 9 స్థానాల్లో టీడీపీ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇక సైకిల్ స్పీడుకు తిరుగే లేదని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.