కాకినాడ, పిఠాపురం స్థానాలు కోరుతూ బీజేపీ నేతల దీక్షలు
పిఠాపురం టౌన్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీల పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు పిఠాపురంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు.
పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో బీజేపీ నాయకులు దీక్షలను నిర్వహించారు. ఆ స్థానాలను బీజేపీ కేటాయించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి చింతపల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ 1998లో ఒంటరిగా కాకినాడ పార్లమెంట్ స్థానంలో బీజేపీ పోటీ చేసి విజయం సాధించిందన్నారు.
టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో రెండుసార్లు బీజేపీ పోటీ చేయగా ఒకసారి బీజేపీ విజయం సాధించినట్టు చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించాలని బీజేపీ కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించినట్టు ఆయన పేర్కొన్నారు.
దీక్షల్లో బీజేపీ నాయకులు బుర్రి మురళీధరరావు, ఈగల కొండబాబు, రాయుడు సూర్యప్రకాశరావు, బచ్చు సత్యనారాయణ, శీరం రామజోగి, దోనె అచ్యుతరామయ్య, పసుపులేటి సత్యనారాయణ, కర్రి అన్నవరం, కసిరెడ్డి సుబ్బారావు, అల్లుబోయిన సూరిబాబు, బాదం బాలాజీ, వాసంశెట్టి పెద్దిరాజు, దంగేటి దొర య్య, దాట్ల సూర్యనారాయణరాజు, రవణం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.