‘ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలి’
Published Sat, Aug 6 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
కామారెడ్డి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ సమన్వయ కర్త డాక్టర్ రిషి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కామారెడ్డిలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే అర్హులందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెంచుకున్నామన్నారు. కానీ రాష్ట్రం వచ్చి రెండేళ్లు గడిచినా ఫలితం కనిపించడం లేదన్నారు. ఉద్యోగాల నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఇంటర్ ఆపై స్థాయి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను నెలకు రూ. 2 వేల చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, వర్కర్‌ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కోర్సుల విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి, కెరీర్ గైడెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు నీల నాగరాజు, ప్రతినిధులు దత్తు, శేఖర్, మహేశ్, నితిన్, గంగాధర్, విజయ్‌కుమార్, యాదగిరి, నాందేవ్, సంజీవ్, సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement