సదస్సులో మాట్లాడుతున్న కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇలా ప్రకటించడం సీఎంకు కొత్తకాదు. నిరుద్యోగులను మోసం చేయడానికే ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోంది. ఇంటికో ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడాలి’ అని నిరుద్యోగులకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం వివిధ సాకులతో ఉద్యోగాలను భర్తీ చేయకుండా జాప్యం చేసిందని, ఇప్పుడు కొత్త జోన్ల పేరుతో మరోసారి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.
మంగళవారం బీసీ భవన్‌లో రాష్ట్ర నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 30 వేల ఉద్యోగాలు అదనం గా వచ్చాయని, అందులో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. సచివాలయంలో ఏ శాఖకు వెళ్లినా అరకొర సిబ్బంది ఉన్నారన్నారు. కొత్తగా 21 జిల్లాలు, 125 మండలాలు, 25 ఆర్‌డీవో ఆఫీసులు, పోలీసుస్టేషన్లను ప్రారంభించినా ఇందులో అరకొర సిబ్బందితో పని నెట్టుకొస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏర్పడ్డ ఖాళీల ఆధారంగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్సిటీల విద్యార్థులు, సంఘం నేతలు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment