
నవసమాజమే బీసీ ఉద్యమ లక్ష్యం: కృష్ణయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడి నవసమాజాన్ని నిర్మించడమే బీసీ ఉద్య మ లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు నేతృత్వంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సభలో కృష్ణయ్య మాట్లాడారు. ‘‘దొరల ఆహంకారం అణచాలంటే బీసీలంతా ఐక్యతతో రాజ్యాధికారం దక్కించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, లేకుంటే ఆయా పార్టీలను రాను న్న ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.
‘బీసీ సీఎం’పై వైఖరి చెప్పాలి
రాష్ట్రం లోని 4.5 కోట్ల మంది బీసీల ప్రగాఢ ఆకాంక్ష అయిన ‘బీసీ ముఖ్యమంత్రి’ పదవి అగ్రకుల పార్టీల అణచివేత కారణంగా వారికి ఇంతవరకు దక్కకుండా పోయిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘బీసీ సీఎం’ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలు వారం రోజుల్లోగా విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ భవన్‌లో జరిగిన 26 కుల సంఘాలు, 15 బీసీ సంఘాల రాజకీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.