
బీసీ సీఎం కృష్ణయ్యే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేస్తేనే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు నేతలు కోరారు. బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు, కుల సంఘాల నేతల విస్తృతస్థాయి సమావేశం గురువారం నగరంలోని ఓ హోట ల్‌లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ కె. ఆల్‌మెన్ రాజు అధ్యక్షతన ఈ సమావేశంలో, టీడీపీ పరిస్థితి దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్రంలో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే 60 నుంచి 80 శాతం బీసీల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని నేతలు వ్యాఖ్యానించారు.
అలాగే బీసీ సంఘాల నాయకులను అసెంబ్లీకి పంపాలని సూచించారు. ఆర్.కృష్ణయ్య సీఎం అయితే సామాజిక తెలంగాణ సాధించినట్లవుతుందని పేర్కొన్నారు. సీమాంధ్రలో కూడా చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవిని బీసీలకే ఇవ్వాలని ఆ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు డిమాండ్ చేశారు. మిగతా పార్టీలు కూడా బీసీలకే సీఎం పదవి ఇస్తామని ప్రకటన చేస్తే వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీలకు రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే టీడీపీకి బహిరంగంగా మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు.
టీడీపీ ఓడిపోయే పార్టీ ఎలా అవుతుంది? : కృష్ణయ్య
బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగానే, ఓడిపోయే పార్టీ టీడీపీ.. బీసీని సీఎం చేస్తానంటోందని విమర్శలు చేయడం వారిని కించపరచడమేనని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో 60 నుంచి 80 శాతం మంది ఉన్న బీసీలు ఓడిపోతారా అని ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలు ఇక ముందు సాగవని అన్నారు. తెలంగాణ దొరలు బీసీలు సీఎం కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఈ వాదన తెస్తున్నారని విమర్శించారు. రాజ్యసభలో ఎంపీగా గెలవడానికి అవసరమైన బలం లేకపోయినా టీఆర్‌ఎస్ బీసీ అభ్యర్థి కేశవరావును నిలబెడితే గెలవలేదా అని సోదాహరణంగా చెప్పుకొచ్చారు. కాగా మీ డిమాండ్ బీసీ వ్యక్తి సీఎం కావాలనా..? లేక కృష్ణయ్య సీఎం కావాలనా? అని విలేకరులు ప్రశ్నించగా, సమావేశానికి వచ్చిన వారంతా కృష్ణయ్య సీఎం అని నినాదాలు చేయగా, కృష్ణయ్య మాత్రం బీసీ అభ్యర్థి సీఎం కావాలని చెప్పారు. టీడీపీలో ఎప్పుడు చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది అందరితో సంప్రదించిన తరువాత వెల్లడిస్తానని ప్రకటించారు. రెండు రోజుల్లో రాజకీయరంగ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జు కృష్ణ, హన్మంతరావు, టీడీపీ కార్పొరేటర్ చంద్రమౌళి, చక్రదారి యాదవ్, నరేందర్ రావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.