రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీల అభివృద్ధి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య
హైదరాబాద్: రాజకీయ రిజర్వేషన్లు లేకుండా బీసీలు ఎదగలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణలో సామాజిక న్యాయం’ అంశంపై జరిగిన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం 10 శాతానికి మించి లేకపోవడం వల్లే ఐక్యం కాలేకపోతున్నామన్నారు.
రాజకీయ రిజర్వేష్లతోనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందగలరన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీ, దళిత, మైనారిటీలపై ప్రేమ లేదని కేవలం వారి ఓటు బ్యాంకు పట్ల మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణలోనే బహుజనులు ఎక్కువగా ఉన్నా రాజ్యాధికారం సాధించకపోవడం బాధకరమన్నారు. సదస్సులో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ఎమ్మా ర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్లు వచ్చే వరకు ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. అలాగే టీచర్ పోస్టులు 25 వేలు, గ్రూప్-1 ఉద్యోగాలు 1,200, గ్రూప్-2 కొలువు లు 2,500, గ్రూప్-4 36 వేలు, ఎస్‌ఐ పోస్టులు 1,600, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 14వేలు ఖాళీగా ఉన్నాయని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏ లెక్కన 25 వేల ఉద్యోగాలు భర్తీచేస్తారని ప్రశ్నించారు.