Political reservations
-
13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు...
నడిపించడమా, కలిసి నడవడమా.. ఏది లీడర్షిప్? రెండూ! ‘యు గో దట్ సైడ్’ అని వేలూ చూపించాలి’, ‘ఇదిగో నాతో రా.. ’ అని చెయ్యీ అందివ్వాలి. పాలిటిక్స్‌లో మహిళలు ప్రజలకు మరింతగా అందుబాటులో, మరింతగా ప్రజామోదంతో ఎందుకు ఉంటారంటే.. ఇందుకే! ఈ రెండు లీడర్షిప్ క్వాలిటీలూ వాళ్లలో అంతర్నిర్మాణంగా ఉన్నందుకే! అలాంటిది.. శిక్షణ కూడా తోడైతే? ఆమె లీడ్ చేస్తుంది. వర్తమానాన్ని, భవిష్యత్తునీ! అలా పొలిటికల్ లీడర్‌షిప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళా బృందం నేడు బయటికి వస్తోంది. 13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు... ‘జన గణ మన.. జన మొర విన, కల నిజమయ్యే.. కాలం ఇదే.. ఛక్ ఛక్ ఛక్..’ మంటూ వస్తున్నారు! అన్ని రంగాల్లోనూ నాయకత్వ స్థానంలో మహిళలు అద్వితీయ శక్తి సామర్థ్యాలతో సంస్థల్ని ముందుకు నడిపిస్తున్నా కూడా రాజకీయ రంగం మాత్రం వాళ్లను వెనక్కి లాగుతోంది. నిజానికి మహిళలు రాణించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి తగిన వేదిక రాజకీయాలే. అందుకే ‘స్త్రీ శక్తి’ స్వచ్ఛంద సంస్థ, సి.ఎ.పి.ఎఫ్. (చీవెనింగ్ ఆలుమ్నీ ప్రాజెక్ట్ ఫండ్) కలిసి మహిళల కోసం ‘షి లీడ్స్’ అనే రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24న వర్చువల్‌గా ప్రారంభించాయి. ఫస్ట్ బ్యాచ్ అది. శిక్షణ నేటితో పూర్తవుతుంది. ఈ లోపే రెండో బ్యాచ్ మొన్న శనివారమే మొదలైంది. తొలి బ్యాచ్‌లో 13 రాష్ట్రాలకు చెందిన 50 మంది మహిళలు కోర్సు పూర్తి చేశారు. రాజకీయ నాయకత్వంతోనే సమానత్వ సాధన షీ లీడ్స్ కోర్సులో శిక్షణ ఇస్తున్నవారంతా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులే! రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టసభల్లో ప్రజా సమస్యల్ని లేవనెత్తడం అనేవి షీ లీడ్స్ సిలబస్‌లోను ప్రధాన అధ్యాయాలు. వాటిల్లో మళ్లీ ఉప–అధ్యాయాలు. రోజుకు 5 గంటల పాటు వారం రోజులు శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేయగానే సర్టిఫికెట్ వస్తుంది. ‘‘అయితే సర్, ఈ సర్టిఫికెట్ మాకు రాజకీయ రంగ ప్రవేశానికి యోగ్యతనిస్తుందా?’’ అని ఓ అభ్యర్థి తొలి రోజు క్లాసులోనే అడిగారు!సహజంగా వచ్చే సందేహమే. ‘‘అసలు మీకు ఈ కోర్సులో చేరాలన్న ఆలోచన రావడమే మీ యోగ్యత. సర్టిఫికెట్ అనేది మీ పాలనా పరమైన పరిజ్ఞానానికి థియరీ రూపం మాత్రమే. ప్రాక్టికల్‌గా మీరెప్పుడో లీడర్స్ అయిపోయారు’’ అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా చెప్పడం ఫస్ట్ బ్యాచ్ ‘యువ పొలిటీషియన్స్’కి స్ఫూర్తినిచ్చే సమాధానం అయింది. స్ఫూర్తి మాత్రమే కాదు. ఉత్సాహం కూడా. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజీవ్ గౌడ, బీజేపీ లోక్‌సభ ప్రస్తుత ఎంపీ హీనా గవిట్, సమాజ్‌వాదీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ ‘షీ లీడ్స్’ ఫస్ట్ బ్యాచ్‌కి రాజకీయ పాఠాలు చెప్పినవారిలో ఉన్నారు. ఈ కోర్సుకు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమొక్రసీ’, నేత్రి, శక్తి సంస్థలు కూడా సహకారం అందించాయి. ‘‘మహిళా నాయకుల్ని ప్రజలు అంగీకరిస్తారు. మహిళా నాయకులూ ప్రజలకు అందుబాటు లో ఉంటారు. అందుకే మహిళలు చొరవగా రాజకీయాల్లోకి రావాలి’’ అని అల్వా తరగతుల ప్రారంభంలోనే చెప్పారు. ‘‘మీరొస్తే రాజకీయాల్లో కులాల ప్రభావం తగ్గుతుంది’’ అంటూ.. రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల సమాజానికీ, దేశానీ జరిగే మంచి గురించి మాట్లాడారు హీనా గవిట్. రెండో బ్యాచ్ ‘షీ లీడ్స్’ క్లాసులకు ఆప్ పార్టీ నుంచి పృథ్వీరెడ్డి, వందనా కుమారి, మాజీ బీజేపీ ఎంపీ అర్చనా చిత్నిస్ వస్తున్నారు. అసలు ఇలాంటి కోర్సు ఎందుకు అనే ప్రశ్న కూడా క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థినిని నుంచి వచ్చింది. ‘మంచి ప్రశ్న’ అన్నారే కానీ, ‘ఇలాంటి కోర్సులో ఎందుకు చేరావు?’ అని రాజకీయ గురువులు అడగలేదు. ‘‘పాలిటిక్స్‌లోనూ ఇదే విధమైన సావధానత ఉండాలి. అలా మహిళా నేతలు మాత్రమే ఉండగలరు. భారతదేశ మహిళా రాజకీయ శక్తిని బలోపేత చేయడం కోసం ఇలాంటి ఒక కోర్సు అవసరం అని మేము భావించాం’’ అని ‘స్త్రీశక్తి’ సంస్థ వ్యవస్థాపకురాలు రేఖా మోడీ అన్నారు. త్వరలోనే కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో షీ లీడ్స్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. మహిళల స్వభావంలోనే నాయకత్వ గుణాలు ఉంటాయి. అయితే పురుషాధిక్యత ఆ గుణాలను మాటలతో, చేతలతో ఏళ్లుగా అప్రాముఖ్యం చేస్తూ వస్తోంది. బాధితులు ఎవరైతే అవుతారో సహజంగానే వారి స్వరం ప్రశ్నిస్తుంది. వారి పిడికిలి బిగుస్తుంది. వారి గళం నినదిస్తుంది. అందుకే సామాజికంగా కూడా అణచివేతల్ని, అవకతవకల్ని, దౌర్జన్యాలను చూస్తున్నప్పుడు మహిళలే ముందుగా స్పందిస్తారు. వాళ్లే ఎందుకు ముందుగా స్పందిస్తారంటే.. ప్రతి అపసవ్యత పర్యవసానం చివరికి వారి మీదే పడుతుంది. మరీ ఈ రాజకీయ కోర్సులో చేరడానికి అర్హత ఏమిటి? రాజకీయ రంగ ప్రవేశానికి ఈ కోర్సు దారి చూపుతుందా? మళ్లీ రెండు ప్రశ్నలు. రేషన్ క్యూలో నిలుచుని ఉన్నప్పుడు మీ కంటపడిన డీలర్ అక్రమాన్ని మీరు చూస్తూ ఊరుకోకుండా జనం తరఫున వేలెత్తి చూపిన క్షణమే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు. రాజకీయ శిక్షణలో చేరేందుకు కూడా ఆ అడిగే తత్వమే, నిలదీసే ఆగ్రహమే క్వాలిఫికేషన్. -
రాజకీయ రిజర్వేషన్ల సాధనే ధ్యేయం
ముషీరాబాద్(హైదరాబాద్): చట్లసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల సాధన తన జీవితాశయమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీల వాటాకోసం పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించామన్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగాయి. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను విద్య, విజ్ఞానం, పరిపాలనకు దూరంగా ఉంచారని, అలాంటి సమయంలో సంఘం స్థాపించి వేలాది ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించి విజయం సాధించామన్నారు. మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సుల అమలు కోసం చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు, రీయింబర్స్మెంట్ సాధించి బీసీలకు సాధికారత కల్పించగలిగామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనకు రెట్టింపు శక్తితో పోరాడతామన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, విద్యార్థి నేత వేముల రామకృష్ణ, మహిళా రక్షకదళ చైర్మన్ ముట్ట జయంతిగౌడ్, బీసీ రక్షకదళ్ నాయకుడు ఉదయ్ పాల్గొన్నారు. -
బోడో సంస్థలతో కేంద్రం ఒప్పందం
న్యూఢిల్లీ: గత కొన్ని దశాబ్దాలుగా అస్సాంలో ప్రత్యేక బోడోలాండ్ కోసం పోరాడుతున్న ప్రత్యేక బోడో ఉద్యమ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్‌యూ)లతో ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఒప్పందంపై సంతకాలు చేసినవారిలో యునైటెడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, ఎన్డీఎఫ్బీ, ఏబీఎస్‌యూ నాయకులు, హోంశాఖ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్, అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ క్రిష్ణ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. సుదీర్ఘకా లంగా పోరాడుతున్న బోడో ప్రజల సమస్యకు పరిష్కారం చూపే ‘చారిత్రక’ ఒప్పందంగా దీన్ని అభివర్ణించారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధికోసం కృషిచేస్తుంది. వారి భాష, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తుం ది’ అని అన్నారు. బోడో తీవ్రవాదుల హింసాకాం డ కారణంగా గడిచిన దశాబ్దాల్లో 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అమిత్‌షా చెప్పారు. ఒప్పందం తర్వాత అస్సాంలోని ప్రజలు సామరస్యంతో జీవిస్తారన్న ఆశాభావాన్ని అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ వ్యక్తం చేశారు. ఎన్డీఎఫ్బీకి చెందిన 1,550 మంది మిలిటెంట్లు లొంగిపోయినట్టు అస్సాం మంత్రి హేమంత్ బిశ్వ శర్మ చెప్పారు. వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బోడో తీవ్రవాద సంస్థలు ఈ ఒప్పందంతో జనజీవన స్రవంతిలోకి వస్తాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 27 ఏళ్లలో మూడోసారి.. ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి. పరిమిత రాజకీయా«ధి కారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది. రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది. తర్వాత బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు. -
బీసీల రాజకీయ సమాధికి కుట్ర
యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలంగాణలో బీసీలను రాజకీయ సమాధి చేసేందుకు కుట్ర జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం సా యంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 56శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించడమే ఇందుకు నిద్శనమన్నారు. బీసీ కులాల ఆశీర్వాద సభలు పెట్టి బీసీల ఓట్లతో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. బీసీ ఓట్లతో గెలిచిన సీఎం కేసీఆర్.. ఆ బీసీ కులాలకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మురళీధర్‌రావు, అనంతరామన్ కమిషన్ సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 34శాతం పెట్టారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం 56శాతం సిలింగ్ అని చెప్పి 34శాతాన్ని 22శాతానికి తగ్గించడంతో సుమారు 2వేల మంది బీసీలు సర్పంచ్ల పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు కేటాయించి.. 56శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ తగ్గించడాన్ని నిరసిస్తూ త్వరలోనే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు బీసీల ఆత్మగౌరవ పోరు గర్జన పేరుతో పాదయాత్ర చేస్తామన్నారు. ఈనెల 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాధూరి అచ్చయ్య, మైలార్‌గూడెం సర్పంచ్ కాధూరి రజిత శ్రీశైలం, నాయకులు మంత్రి రాజు, పేరపు రాములు, అక్కినపల్లి వెంకటరత్నం, యువజన సంఘం అధ్యక్షుడు మధు, మాటూరి అశోక్, చిరిగె శ్రీనివాస్, రేగు నర్సింహ, నల్లమాస శేఖర్, కాధూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్ కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీలకు చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని వివరించారు. అగ్రకులాల్లో 10% ఉన్న పేదలకు 10 % రిజర్వేషన్లు కల్పించినట్టే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. -
కొత్త ఆశలు..!
రాజకీయ నిరుద్యోగులు, రిజర్వేషన్లు అనుకూలించక పాలిటిక్స్నుంచి దూరమైన వారు, ఆర్థికంగా ఉన్నవారి కన్ను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న నగర, గ్రామ పంచాయతీలపై పడింది. ఒక్కసారైనా ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో విందులు, వినోదా లకు తెరలేపడమే కాకుండా రాజకీయబేరసారాలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు రిజర్వేషన్లు దడ పుట్టిస్తున్నప్పటికీ.. అనుకూలంగా రాకపోతే తాము చెబితే వినే వ్యక్తులను బరిలో నిలిపేందుకు ఎత్తులు వేస్తున్నారు. మొత్తంగా స్థానిక పదువులపై ఆశలు పెట్టుకున్న వారందరూ ఎన్నికల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, యాదాద్రి : నూతన చట్టం ద్వారా కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఏర్పడనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ హడావుడి మొదలైంది. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకం కానున్నాయి. ఎంతో కాలంగా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరూ రిజర్వేషన్ల ఖరారు ఎలా ఉంటుందోనన్న ఆత్రుతతో ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఎన్నికల్లో 50శాతం మహిళలకు రిజర్వ్ చేస్తారు. మున్సిపల్, నగర, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్నింటిల్లో 50 శాతం ఆయా కేటగిరీల వారీగా కేటాయిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల యధావిధిగా కొనసాగుతాయా లేక కొత్త రిజర్వేషన్లు రూపొందిస్తారా.. అనే విషయం అంతు చిక్కడం లేదు. నూతన చట్టం అమలులోకి రాగానే నిర్ణీత సమయంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కసరత్తు ఎప్పుడో ప్రారంభించింది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందగానే∙గిరిజన తండాలు, మధిర గ్రామాలు కొత్త గ్రామ పంచాయతీలుగా పురుడుపోసుకోబోతున్నాయి. 2018, ఆగస్టు 1 వ తేది నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది. పునర్విభజన నేపథ్యంలో.. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం రూపు రేఖలు మారాయి. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల పరంగానే జరుగుతాయి. 2013లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం నూతన జిల్లాల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ నుంచి విడివడిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా 16 మండలాలతో ఏర్పాటైంది. ఇందులో మోటాకొండూరు, అడ్డగూడురు రెండు కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి. ఆశావాహుల్లో రిజర్వేషన్ గుబులు ఎలాగైనా సరే.. ఒక్కసారైనా ప్రజాప్రతినిధిని కావలన్న ఆశతో ఉన్నవారికి రిజర్వేషన్ దడ పట్టుకుంది. గ్రామ పంచాయతీల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల్లో మహిళ, జనరల్ రిజర్వేషన్లు ఉంటాయి. వీటితో పాటు మహిళలకు సర్పంచ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. అంటే మొత్తం గ్రామ పంచాయతీల్లో అన్ని రిజర్వేషన్లు కలుపుకుని 50 శాతం మహిళలు సర్పంచ్‌లు అవుతారు. రిజర్వేషన్లు అనుకూలించగా రాజకీయాల నుంచి దూరమైన వారు ఉన్నారు. ఈనేపధ్యంలో ఈసారి మన గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఏమై ఉంటుందన్న చర్చ రచ్చబండల వద్ద జోరుగా సాగుతోంది. ఈ రిజర్వేషన్ అయితే ఇతను పోటీ చేస్తాడు. ఆరిజర్వేషన్ అయితే అతను పోటీ చేస్తాడు అన్నకోణంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆశావాహులు విందు వినోదాలకు తెరలేపారు. ఎలా ఎదుర్కొవాలి.. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే విధంగా చూడాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ గత రిజర్వేషన్లు ఈసారి యధావిధిగా కొనసాగుతాయన్న ప్రచారం జోరందుకుంది. పాత రిజర్వేషన్లు ఉంటే ఎలా ముందుకుపోవాలని, లేదంటే కొత్త రిజర్వేషన్లు వస్తే ఎలా ఎదుర్కొవాలని అందుకు అనుగుణంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపికను గుట్టుచప్పుడు కాకుండా ఖరారు చేస్తున్నారు. ఏది ఏమైనా శాసనసభలో ప్రవేశపెట్టే స్థానిక సంస్థల బిల్లు రానున్న ఎన్నికల్లో ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించబోతోంది. పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. మున్సిపాలిటీ, నగరపంచాయతీ, గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ వంటి పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది తేడాలో ఓటమి పాలైన పలువురు ఈసారి ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా పదవిని అధిష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈమేరకు గ్రామాల్లో రాజకీయ రాయబారాలు మొదలుపెట్టారు. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకుంటున్నారు. అనుకూల వర్గంతోపాటు, ప్రతికూల వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిన్న చిన్న శుభకార్యాలను కూడా పెద్ద ఎత్తున చేస్తూ బంధువులు, శ్రేయోభిలాషులు, వివిధ వర్గాలను ఆహ్వానించి పోటీ చేయాలన్న తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక ఓటింగ్‌తోనే దళితుల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను అందించడం లేదని, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించిన ప్రత్యేక ఓటింగ్ ద్వారా మాత్రమే దళితులకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని దళిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు, రాబర్ట్ కెనడీ అవార్డు గ్రహీత మార్టీన్ మెక్వాన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ 7వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెక్వాన్ స్మారకోపన్యాసం చేస్తూ.. ప్రస్తుత ఎన్నికల విధానంలో నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదని, అత్య«ధిక ఓట్లు దళితేతరులవే కావడంతో దళితుల సమస్యలను పరిష్కరించడంలో రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని చెప్పారు. దళిత ప్రతినిధులకు దళితులు మాత్రమే ఓటు వేసుకునే విధానాన్ని సపరేట్ ఎలక్టోరేట్ అంటారని, 1932లో అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఇచ్చిన కమ్యూనల్ అవార్డును మహాత్మా గాంధీ వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు అమలులో ఉన్న రాజకీయ రిజర్వేషన్ల విధానం వచ్చిందని తెలిపారు. అప్పటికే ముస్లింలకు, ఆంగ్లోఇండియన్లకు ఇటువంటి ప్రత్యేక ఓటింగ్ విధానం అమలులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గుజరాత్లో దయనీయం.. ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న గుజరాత్లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో ఉమ్మడి నీటి వనరులను వినియోగించుకునే స్వేచ్ఛ దళితులకు లేదని, వేలాది గ్రామాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని చెప్పారు. దళిత ప్రజాప్రతినిధులు వారి పార్టీ, నాయకత్వానికే విశ్వసనీయంగా ఉంటున్నార ని, దీనికి ఇప్పుడున్న ఓటింగ్ విధానమే కారణమని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి అధికారులు దళితుల కోసం చేసిన సేవలను భవిష్యత్ తరాలు, ప్రస్తుత అధికార యంత్రాంగం మార్గదర్శకంగా తీసుకోవాలని మెక్వాన్ సూచించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారి పాలనా సమయంలో తాము ఉండటం, ఆయనతో సన్నిహితంగా ఉండటం ఒక చక్కటి అనుభూతిగా భావిస్తున్నామని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని, శంకరన్ ఒక్క ఏడాదిలోనే 120కిపైగా జీవోలపై సంతకాలు చేయడం, అవన్నీ దళితుల అభ్యున్నతికి సంబంధించినవే కావడం ప్రపంచంలోనే అరుదైన దృశ్యంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. దళితుల కోసమే ఆయన జీవితం సభకు అధ్యక్షత వహించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పేదలు, ఆదివాసీల కోసం, దళితేతర సమాజంలోని చాలా మంది వ్యక్తులు పనిచేసారని, కానీ దళితుల కోసం జీవితమంతా ధారబోసిన ఏకైక వ్యక్తి శంకరన్ అని కొనియాడారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ శంకరన్ గారి స్ఫూర్తి వల్లనే ఐఏఎస్ అధికారిగా నిబద్ధతతో కూడిన కార్యాచరణను కొనసాగించానని, అటువంటి వ్యక్తితో చివరికంటా స్ఫూర్తిని పొందుతూ వచ్చానని చెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ వైవీ సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేస్తూ.. శంకరన్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. ఎస్సీ హాస్టల్లో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన పేద దళిత బాలికకు ఏటా ఇచ్చే లక్ష్మీవేణుగోపాల్ అవార్డును అన్వేషి కార్యదర్శి డాక్టర్ కె.లలిత వనపర్తి జిల్లాకు చెందిన సి.ఆశకు అందజేశారు. -
‘వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి’
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): వికలాంగులకు రాజకీయాల్లో గ్రామస్థాయి నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా వికలాంగులకు అన్యాయం జరుగుతోందని, సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. రాజకీయంగా అవకాశం కల్పించడం లేదని, వికలాంగులను ప్రభుత్వా లు చిన్నచూపు చూడడం సరికాదన్నారు. రాష్ట్రం లో 20లక్షల వికలాంగ ఓటర్లున్నారని తెలిపా రు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు చదువుకునే వారికి మోటారు వాహనాలు, ట్యారీ సైకిళ్లు అందించాలన్నారు. ఉపాధి కల్పన శాఖ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వివి ధ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వికలాంగులతో దుర్భాషలాడిన వారిపై అట్రాసిటీ చట్టం తేవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు నారాయణ ఉన్నారు. -
‘పూనా’లోనే జరిగింది ద్రోహం
గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షతో అంబేడ్కర్ తదితరులకు ఇష్టంలేకున్నా సరిగ్గా 83 ఏళ్ల క్రితం పూనా ఒప్పందం జరిగింది. దాని ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయ అధికార భాగస్వామ్యం అందలేదు. రాజకీయ రిజర్వేషన్లు పాక్షిక ప్రయోజనాన్నే అందించాయి. సవర్ణ హిందువులు లేదా దళితేతరులు తమకు అనుకూలమైన దళితులే ఎన్నికయ్యేలా చేస్తున్నారు. అవీ లేకుండా చేయాలని జరిగిన కుట్రలను అంబేడ్కర్ ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కాయి. లేకుంటే ఆ అవకాశమూ దక్కేది కాదు. శతాబ్దాలుగా అణచివేతకు, తరతరాలుగా వెలివేతకు గురవుతున్న వర్గాలకు విముక్తిని కలిగించడంలో రాజకీయాధికారం కీలకపాత్ర వహిస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ భావించారు. రాజ్యాంగపరంగా అది అక్షరాలా అమలు జరిగేలా చూసేందుకు అహరహం తపించారు. కానీ అంబే డ్కర్ తన ఆలోచనలకు ఆచరణ రూపాన్నిచ్చే ప్రతి సందర్భంలోనూ కొందరు మోకాలడ్డారు. ఆయన ఆశించినది ఆశించినట్టు జరగకుండా, అణగారిన వర్గాలకు ఫలితాలను అందకుండా చేయడంలో కొంత మేరకు కృతకృత్యుల య్యారు. 83 ఏళ్ళ క్రితం 1932 సెప్టెంబర్ 24న, సరిగ్గా ఇదే రోజున ‘పూనా ఒడంబడిక’ పేరిట దళితులకు ద్రోహం జరిగింది. ఇది రెండు విభిన్న సామా జికవర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. అంబేడ్కర్, గాంధీలు ప్రత్యర్థులుగా నిలిచి పూనాలో కుదుర్చుకున్న ఆ ఒప్పందం దుష్ర్ఫభావం ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయాధికార భాగస్వామ్యం అందలేదు. అంబేడ్కర్, గాంధీల సంఘర్షణ అంబేడ్కర్ 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రావాలనీ, ప్రభుత్వాలలో వారికి సరైన ప్రాతినిధ్యం ఉండాలనీ వాదిస్తూ వచ్చారు. 1927లో సైమన్ కమిషన్ ముందు కూడా ఆయన తన వాదనలను వినిపించారు. 1930-32 మధ్య లండన్‌లో జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై గట్టిగా వాదించారు. మొదటి సమా వేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మహా త్మాగాంధీ కాంగ్రెస్ తరఫున నిలిచి... అంటరాని కులాల రాజకీయ హక్కుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేడ్కర్, గాంధీల మధ్య ఈ విష యమై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారనీ, హిందువులలో భాగంగా వీరిని ఏనాడూ చూడలేదనీ, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారనీ అంబేడ్కర్ వాదించారు. ఆ కారణం గానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలనీ కోరారు. లేకుంటే రాజకీయ స్వేచ్ఛకు బదులు వారు తరతరాల బానిసత్వానికి బలికావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అంటరాని వారు హిందువులేనని, వారికి ప్రత్యేక ఓటింగ్ హక్కులు, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే ఏర్పాట్లు అవసరం లేదని గాంధీ గట్టిగా అడ్డుతగిలారు. రెండు వాదనలనూ విన్న బ్రిటిష్ ప్రభుత్వం అంబేడ్కర్ సూచించినట్టు అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కుకు, తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశానికి అంగీకరించింది. దానిని తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ 1932 మార్చి 11న ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తూ ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కులు కల్పిస్తే నేను ఆమ రణ నిరాహారదీక్ష చేయగలనని తెలియజేస్తున్నాను’’ అని హెచ్చరించారు. ఇదే అంశంపై నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో రామ్సే మెక్‌డొనాల్డ్ ‘‘మీ ఉద్దేశం హిందువులకూ, అంటరాని కులాలకూ కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐకమత్యం సంరక్షించుకోవాలని కూడా కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా చేయుటకే మీరు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోక తప్పడం లేదు’’ అని అన్నారు. ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ ఇవ్వడం కూడా వారిని రక్షించదు’’ అంటూ గాంధీ తన పాత ధోరణిలోనే ఆయనకు సమాధానం ఇచ్చారు. ‘నిరాహారదీక్ష’ కుతంత్రం ఆ సందర్భంగా అంబేడ్కర్ ‘‘స్వతంత్ర రాజ్యాంగంలో మెజారిటీగా ఉన్న హిందువుల నిరంకుశత్వం నుంచి తమను తాము రక్షించుకోవడానికి రాజ కీయ హక్కులను సాధించుకోవాల్సిన వర్గం ఏదైనా ఉందంటే అది అంట రాని, అణగారిన ప్రజానీకమేననేది వాస్తవం. ఏ మతానికైతే వారు బందీ లుగా ఉన్నారో ఆ మతం వారికి ఒక గౌరవ స్థానాన్ని కల్పించడానికి బదులు కుష్ఠు రోగులకన్నా హీనంగా చూస్తున్నది. దళితులను ఆర్థికంగా మరింత పరా ధీనులను చేస్తున్నది. ఎవరైనా చైతన్యవంతులై తల ఎత్తి నిలబడితే అందరూ కలసి దాడులు చేస్తున్నారు’’ అంటూ గాంధీ లాంటి వారికి దీటైన జవా బిచ్చారు. దళితుల పక్షాన అంబేడ్కర్, సవర్ణ హిందువుల పక్షాన గాంధీ తల పడిన సందర్భమిది. చర్చకు వచ్చిన అన్ని ప్రశ్నలకూ అంబేడ్కర్ దీటుగా సమాధానం ఇచ్చారు. అంటరాని కులాల ప్రత్యేక ఓటింగ్ హక్కును అడ్డు కోవడానికి గాంధీ ఉపవాస దీక్ష పూని, ప్రాణాలు తీసుకుంటానని భయ పెట్టారు. దీంతో అంబేడ్కర్, ఇతర అంటరాని కులాల నాయకులు వారికి ఇష్టం లేని విధానానికి ఆమోదం పలికేలా చేసి, ఒప్పందంపై సంతకాలు చేయించుకున్నారు. ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే, తనకు ప్రాణహాని జరిగితే, మైనారిటీలుగా ఉన్న అంటరాని కులాలపై ప్రతి గ్రామంలో దాడులు జరుగుతాయని కూడా గాంధీజీ పరోక్షంగా హెచ్చరించారు. అందువల్ల ఈ ఒప్పందానికి గాంధీ చేసిన కుట్రే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ఈ ఒప్పందంలో తొమ్మిది అంశాలున్నాయి. ప్రత్యేక ఓటింగ్ పద్ధతికి బదులుగా నేటి రిజర్వుడు స్థానాల విధానానికి అంగీకారం ఈ ఒప్పందంలో కీలక అంశం. నాడే దళితుల నుంచి స్వతంత్ర రాజకీయ నాయకులు ఎదిగే ప్రక్రియకు గండి పడింది. 1937, 1942 సాధారణ ఎన్నికల్లో అదే రుజువైంది. కేవలం కాంగ్రెస్ అనుచరులు మాత్రమే రిజర్వుడు స్థానాల నుంచి ఎన్ని కయ్యారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారారే తప్ప అంటరాని కులాల ప్రతినిధులుగా నిలవలేకపోయారు. రాజ్యాంగ సభలోనే రిజర్వేషన్ల వ్యతిరేక కుట్ర అంబేడ్కర్ అంతటితో ప్రత్యేక ఓటింగ్ హక్కు డిమాండ్‌ను వదిలిపెట్టలేదు. 1946లో రాజ్యాంగ సభకు అందించిన ‘రాష్ట్రాలు-మైనార్టీలు’ అనే వినతి పత్రంలో అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కును కోరారు. కానీ, రిజర్వేషన్లను, అణగారిన వర్గాల హక్కులను అంగీకరించలేని సవర్ణ హిందువులు మరొక కుట్రకు తెరతీశారు. రాజ్యాంగ రచన సభలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రూపంలో అడ్డుపడ్డారు. రాజ్యాంగ సభ పటేల్ నేతృ త్వంలో మైనార్టీల సమస్యలపై వేసిన ఉపసంఘం తన నివేదికలో అన్నిరకాల రిజర్వేషన్లనూ రద్దు చేయాలని సిఫారసు చేసింది. ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మౌనం దాల్చి, అణగారిన వర్గాల హక్కులు పట్టనట్టు వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో ఆ సమయంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్ ప్రత్య క్షంగా రంగంలోకి దిగక తప్పలేదు. ‘‘ఈ రాజ్యాంగ రచన ద్వారా షెడ్యూల్డ్ కులాలకు కొన్ని రక్షణలు లభిస్తాయని భావించాను. అంటరాని కులాలకు మీరు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే నేను రాజ్యాంగ సభలో సభ్యు నిగా కొనసాగాల్సిన అవసరం లేదు. నేను బయటకు వెళ్ళిపోతాను. అంట రాని కులాల సంక్షేమాన్ని సవర్ణ హిందువులు కుట్రపూరితంగా అడ్డుకున్నారని చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ఆయన హెచ్చరించారు. దీంతో పటేల్ వంటి వారు దిగిరాక తప్పలేదు. చివరకు 1949 మే 25, 26 తేదీల్లో రాజ్యాంగ సభ షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లను కొనసాగించాలని తీర్మానించింది. ఆత్మావలోకనం అవసరం అయితే, రాజకీయ రిజర్వేషన్లు ఒక పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే అం దించాయి. 80 శాతంగా ఉన్న సవర్ణ హిందువులు లేదా దళితేతరులు నిజ మైన దళిత ప్రతినిధులనుగాక, తమకు అనుకూలమైన రాజకీయ నాయకులకే ఎన్నికయ్యే అవకాశం కల్పిస్తున్నారు. అంబేడ్కర్ ప్రతిపాదించినట్టుగా ప్రత్యేక ఓటింగ్ పద్ధతి ద్వారా తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధా నం అమలు జరిగి ఉంటే నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వార నడంలో ఎటువంటి సందేహం లేదు. అంబేడ్కర్ పటేల్ నేతృత్వంలో సవర్ణ హిందువుల కుట్రలను గట్టిగా ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వే షన్లు దక్కాయి. లేకుంటే దళితులకు ఆ అవకాశమూ దక్కకుండా పోయేది. పూనా ఒడంబడిక ద్వారా దళితుల రాజకీయ స్వాతంత్య్రానికి జరగ రాని నష్టం జరిగిపోయింది. దళిత ప్రజాప్రతినిధులు నిజమైన రాజకీయ నిర్ణే తలుగా దళితుల పక్షాన నిలవడానికి అడ్డుపడుతున్న అంశాలను సమీక్షించు కోవాలి. చివరిగా ఒకమాట. రాజకీయ రిజ ర్వేషన్లవల్ల కలిగే ప్రయోజనాలు పరిమితమైనవే. అయినా అవి అంబేడ్కర్ తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి సాధించినవి. ఆ హక్కును అనుభవిస్తున్న దళిత ప్రజాప్రతినిధులు, రాజకీయవేత్తలు ఈ రోజుకైనా ఆత్మావలోకనం చేసుకోక తప్పదు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీల అభివృద్ధి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: రాజకీయ రిజర్వేషన్లు లేకుండా బీసీలు ఎదగలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణలో సామాజిక న్యాయం’ అంశంపై జరిగిన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం 10 శాతానికి మించి లేకపోవడం వల్లే ఐక్యం కాలేకపోతున్నామన్నారు. రాజకీయ రిజర్వేష్లతోనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందగలరన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీ, దళిత, మైనారిటీలపై ప్రేమ లేదని కేవలం వారి ఓటు బ్యాంకు పట్ల మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణలోనే బహుజనులు ఎక్కువగా ఉన్నా రాజ్యాధికారం సాధించకపోవడం బాధకరమన్నారు. సదస్సులో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ఎమ్మా ర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్లు వచ్చే వరకు ఉద్యమం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. అలాగే టీచర్ పోస్టులు 25 వేలు, గ్రూప్-1 ఉద్యోగాలు 1,200, గ్రూప్-2 కొలువు లు 2,500, గ్రూప్-4 36 వేలు, ఎస్ఐ పోస్టులు 1,600, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 14వేలు ఖాళీగా ఉన్నాయని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏ లెక్కన 25 వేల ఉద్యోగాలు భర్తీచేస్తారని ప్రశ్నించారు. -
ఎర్రకోటను ముట్టడిస్తాం
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: జాజుల శ్రీనివాస్‌గౌడ్ సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనైనా బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించకపోతే ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడిస్తామని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన సంఘం పదాధికారుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడచినా బీసీల సమస్యల పరిష్కారంలో ఉలుకుపలుకు లేకపోవడం బాధిస్తోందన్నారు. పార్లమెంట్లో అన్ని బిల్లులను ఆమోదిస్తూ బీసీ బిల్లు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ముఖం చాటేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే తప్ప ఈ దేశంలో సామాజిక న్యాయం జరగదని, అందుకోసం బీసీలు కేంద్రంపై సమరభేరీ మోగించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శారద, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, బర్క కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.