ముషీరాబాద్(హైదరాబాద్): చట్లసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల సాధన తన జీవితాశయమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీల వాటాకోసం పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించామన్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను విద్య, విజ్ఞానం, పరిపాలనకు దూరంగా ఉంచారని, అలాంటి సమయంలో సంఘం స్థాపించి వేలాది ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించి విజయం సాధించామన్నారు. మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సుల అమలు కోసం చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు, రీయింబర్స్‌మెంట్ సాధించి బీసీలకు సాధికారత కల్పించగలిగామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనకు రెట్టింపు శక్తితో పోరాడతామన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, విద్యార్థి నేత వేముల రామకృష్ణ, మహిళా రక్షకదళ చైర్మన్ ముట్ట జయంతిగౌడ్, బీసీ రక్షకదళ్ నాయకుడు ఉదయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment