రాజకీయ నిరుద్యోగులు, రిజర్వేషన్లు అనుకూలించక పాలిటిక్స్‌నుంచి దూరమైన వారు, ఆర్థికంగా ఉన్నవారి కన్ను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న నగర, గ్రామ పంచాయతీలపై పడింది.
ఒక్కసారైనా ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో విందులు, వినోదా లకు తెరలేపడమే కాకుండా రాజకీయబేరసారాలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు రిజర్వేషన్లు దడ పుట్టిస్తున్నప్పటికీ.. అనుకూలంగా రాకపోతే తాము చెబితే వినే వ్యక్తులను బరిలో నిలిపేందుకు ఎత్తులు వేస్తున్నారు. మొత్తంగా స్థానిక పదువులపై ఆశలు పెట్టుకున్న వారందరూ ఎన్నికల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
సాక్షి, యాదాద్రి : నూతన చట్టం ద్వారా కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఏర్పడనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ హడావుడి మొదలైంది. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకం కానున్నాయి. ఎంతో కాలంగా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరూ రిజర్వేషన్ల ఖరారు ఎలా ఉంటుందోనన్న ఆత్రుతతో ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఎన్నికల్లో 50శాతం మహిళలకు రిజర్వ్ చేస్తారు.
మున్సిపల్, నగర, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్నింటిల్లో 50 శాతం ఆయా కేటగిరీల వారీగా కేటాయిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల యధావిధిగా కొనసాగుతాయా లేక కొత్త రిజర్వేషన్లు రూపొందిస్తారా.. అనే విషయం అంతు చిక్కడం లేదు. నూతన చట్టం అమలులోకి రాగానే నిర్ణీత సమయంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కసరత్తు ఎప్పుడో ప్రారంభించింది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందగానే∙గిరిజన తండాలు, మధిర గ్రామాలు కొత్త గ్రామ పంచాయతీలుగా పురుడుపోసుకోబోతున్నాయి. 2018, ఆగస్టు 1 వ తేది నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుంది.
పునర్విభజన నేపథ్యంలో..
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం రూపు రేఖలు మారాయి. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల పరంగానే జరుగుతాయి. 2013లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం నూతన జిల్లాల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ నుంచి విడివడిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా 16 మండలాలతో ఏర్పాటైంది. ఇందులో మోటాకొండూరు, అడ్డగూడురు రెండు కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి.
ఆశావాహుల్లో రిజర్వేషన్ గుబులు
ఎలాగైనా సరే.. ఒక్కసారైనా ప్రజాప్రతినిధిని కావలన్న ఆశతో ఉన్నవారికి రిజర్వేషన్ దడ పట్టుకుంది. గ్రామ పంచాయతీల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల్లో మహిళ, జనరల్ రిజర్వేషన్లు ఉంటాయి. వీటితో పాటు మహిళలకు సర్పంచ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. అంటే మొత్తం గ్రామ పంచాయతీల్లో అన్ని రిజర్వేషన్లు కలుపుకుని 50 శాతం మహిళలు సర్పంచ్‌లు అవుతారు. రిజర్వేషన్లు అనుకూలించగా రాజకీయాల నుంచి దూరమైన వారు ఉన్నారు. ఈనేపధ్యంలో ఈసారి మన గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఏమై ఉంటుందన్న చర్చ రచ్చబండల వద్ద జోరుగా సాగుతోంది. ఈ రిజర్వేషన్ అయితే ఇతను పోటీ చేస్తాడు. ఆరిజర్వేషన్ అయితే అతను పోటీ చేస్తాడు అన్నకోణంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆశావాహులు విందు వినోదాలకు తెరలేపారు.
ఎలా ఎదుర్కొవాలి..
తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే విధంగా చూడాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రిజర్వేషన్‌లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ గత రిజర్వేషన్‌లు ఈసారి యధావిధిగా కొనసాగుతాయన్న ప్రచారం జోరందుకుంది. పాత రిజర్వేషన్‌లు ఉంటే ఎలా ముందుకుపోవాలని, లేదంటే కొత్త రిజర్వేషన్‌లు వస్తే ఎలా ఎదుర్కొవాలని అందుకు అనుగుణంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపికను గుట్టుచప్పుడు కాకుండా ఖరారు చేస్తున్నారు. ఏది ఏమైనా శాసనసభలో ప్రవేశపెట్టే స్థానిక సంస్థల బిల్లు రానున్న ఎన్నికల్లో ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించబోతోంది.
పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు..
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. మున్సిపాలిటీ, నగరపంచాయతీ, గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ వంటి పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది తేడాలో ఓటమి పాలైన పలువురు ఈసారి ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా పదవిని అధిష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈమేరకు గ్రామాల్లో రాజకీయ రాయబారాలు మొదలుపెట్టారు. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకుంటున్నారు. అనుకూల వర్గంతోపాటు, ప్రతికూల వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిన్న చిన్న శుభకార్యాలను కూడా పెద్ద ఎత్తున చేస్తూ బంధువులు, శ్రేయోభిలాషులు, వివిధ వర్గాలను ఆహ్వానించి పోటీ చేయాలన్న తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment