న్యూఢిల్లీ: గత కొన్ని దశాబ్దాలుగా అస్సాంలో ప్రత్యేక బోడోలాండ్ కోసం పోరాడుతున్న ప్రత్యేక బోడో ఉద్యమ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్‌యూ)లతో ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఒప్పందంపై సంతకాలు చేసినవారిలో యునైటెడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, ఎన్‌డీఎఫ్‌బీ, ఏబీఎస్‌యూ నాయకులు, హోంశాఖ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్, అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ క్రిష్ణ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. సుదీర్ఘకా లంగా పోరాడుతున్న బోడో ప్రజల సమస్యకు పరిష్కారం చూపే ‘చారిత్రక’ ఒప్పందంగా దీన్ని అభివర్ణించారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధికోసం కృషిచేస్తుంది.
వారి భాష, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తుం ది’ అని అన్నారు. బోడో తీవ్రవాదుల హింసాకాం డ కారణంగా గడిచిన దశాబ్దాల్లో 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అమిత్‌షా చెప్పారు. ఒప్పందం తర్వాత అస్సాంలోని ప్రజలు సామరస్యంతో జీవిస్తారన్న ఆశాభావాన్ని అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ వ్యక్తం చేశారు. ఎన్‌డీఎఫ్‌బీకి చెందిన 1,550 మంది మిలిటెంట్లు లొంగిపోయినట్టు అస్సాం మంత్రి హేమంత్ బిశ్వ శర్మ చెప్పారు. వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బోడో తీవ్రవాద సంస్థలు ఈ ఒప్పందంతో జనజీవన స్రవంతిలోకి వస్తాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
27 ఏళ్లలో మూడోసారి..
ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి. పరిమిత రాజకీయా«ధి కారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది. రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది. తర్వాత బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment