రాజకీయ శక్తిగా మహిళ
నడిపించడమా, కలిసి నడవడమా.. ఏది లీడర్‌షిప్? రెండూ! ‘యు గో దట్ సైడ్’ అని వేలూ చూపించాలి’, ‘ఇదిగో నాతో రా.. ’ అని చెయ్యీ అందివ్వాలి. పాలిటిక్స్‌లో మహిళలు ప్రజలకు మరింతగా అందుబాటులో, మరింతగా ప్రజామోదంతో ఎందుకు ఉంటారంటే.. ఇందుకే! ఈ రెండు లీడర్‌షిప్ క్వాలిటీలూ వాళ్లలో అంతర్నిర్మాణంగా ఉన్నందుకే! అలాంటిది.. శిక్షణ కూడా తోడైతే? ఆమె లీడ్ చేస్తుంది. వర్తమానాన్ని, భవిష్యత్తునీ! అలా పొలిటికల్ లీడర్‌షిప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళా బృందం నేడు బయటికి వస్తోంది. 13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు... ‘జన గణ మన.. జన మొర విన, కల నిజమయ్యే.. కాలం ఇదే.. ఛక్ ఛక్ ఛక్..’ మంటూ వస్తున్నారు!
అన్ని రంగాల్లోనూ నాయకత్వ స్థానంలో మహిళలు అద్వితీయ శక్తి సామర్థ్యాలతో సంస్థల్ని ముందుకు నడిపిస్తున్నా కూడా రాజకీయ రంగం మాత్రం వాళ్లను వెనక్కి లాగుతోంది. నిజానికి మహిళలు రాణించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి తగిన వేదిక రాజకీయాలే. అందుకే ‘స్త్రీ శక్తి’ స్వచ్ఛంద సంస్థ, సి.ఎ.పి.ఎఫ్. (చీవెనింగ్ ఆలుమ్నీ ప్రాజెక్ట్ ఫండ్) కలిసి మహిళల కోసం ‘షి లీడ్స్’ అనే రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24న వర్చువల్‌గా ప్రారంభించాయి. ఫస్ట్ బ్యాచ్ అది. శిక్షణ నేటితో పూర్తవుతుంది. ఈ లోపే రెండో బ్యాచ్ మొన్న శనివారమే మొదలైంది. తొలి బ్యాచ్‌లో 13 రాష్ట్రాలకు చెందిన 50 మంది మహిళలు కోర్సు పూర్తి చేశారు.
రాజకీయ నాయకత్వంతోనే సమానత్వ సాధన
షీ లీడ్స్ కోర్సులో శిక్షణ ఇస్తున్నవారంతా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులే! రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టసభల్లో ప్రజా సమస్యల్ని లేవనెత్తడం అనేవి షీ లీడ్స్ సిలబస్‌లోను ప్రధాన అధ్యాయాలు. వాటిల్లో మళ్లీ ఉప–అధ్యాయాలు. రోజుకు 5 గంటల పాటు వారం రోజులు శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేయగానే సర్టిఫికెట్ వస్తుంది. ‘‘అయితే సర్, ఈ సర్టిఫికెట్ మాకు రాజకీయ రంగ ప్రవేశానికి యోగ్యతనిస్తుందా?’’ అని ఓ అభ్యర్థి తొలి రోజు క్లాసులోనే అడిగారు!సహజంగా వచ్చే సందేహమే. ‘‘అసలు మీకు ఈ కోర్సులో చేరాలన్న ఆలోచన రావడమే మీ యోగ్యత. సర్టిఫికెట్ అనేది మీ పాలనా పరమైన పరిజ్ఞానానికి థియరీ రూపం మాత్రమే. ప్రాక్టికల్‌గా మీరెప్పుడో లీడర్స్ అయిపోయారు’’ అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా చెప్పడం ఫస్ట్ బ్యాచ్ ‘యువ పొలిటీషియన్స్’కి స్ఫూర్తినిచ్చే సమాధానం అయింది. స్ఫూర్తి మాత్రమే కాదు. ఉత్సాహం కూడా. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజీవ్ గౌడ, బీజేపీ లోక్‌సభ ప్రస్తుత ఎంపీ హీనా గవిట్, సమాజ్‌వాదీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ ‘షీ లీడ్స్’ ఫస్ట్ బ్యాచ్‌కి రాజకీయ పాఠాలు చెప్పినవారిలో ఉన్నారు. ఈ కోర్సుకు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమొక్రసీ’, నేత్రి, శక్తి సంస్థలు కూడా సహకారం అందించాయి.
‘‘మహిళా నాయకుల్ని ప్రజలు అంగీకరిస్తారు. మహిళా నాయకులూ ప్రజలకు అందుబాటు లో ఉంటారు. అందుకే మహిళలు చొరవగా రాజకీయాల్లోకి రావాలి’’ అని అల్వా తరగతుల ప్రారంభంలోనే చెప్పారు. ‘‘మీరొస్తే రాజకీయాల్లో కులాల ప్రభావం తగ్గుతుంది’’ అంటూ.. రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల సమాజానికీ, దేశానీ జరిగే మంచి గురించి మాట్లాడారు హీనా గవిట్. రెండో బ్యాచ్ ‘షీ లీడ్స్’ క్లాసులకు ఆప్ పార్టీ నుంచి పృథ్వీరెడ్డి, వందనా కుమారి, మాజీ బీజేపీ ఎంపీ అర్చనా చిత్నిస్ వస్తున్నారు. అసలు ఇలాంటి కోర్సు ఎందుకు అనే ప్రశ్న కూడా క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థినిని నుంచి వచ్చింది. ‘మంచి ప్రశ్న’ అన్నారే కానీ, ‘ఇలాంటి కోర్సులో ఎందుకు చేరావు?’ అని రాజకీయ గురువులు అడగలేదు. ‘‘పాలిటిక్స్‌లోనూ ఇదే విధమైన సావధానత ఉండాలి. అలా మహిళా నేతలు మాత్రమే ఉండగలరు. భారతదేశ మహిళా రాజకీయ శక్తిని బలోపేత చేయడం కోసం ఇలాంటి ఒక కోర్సు అవసరం అని మేము భావించాం’’ అని ‘స్త్రీశక్తి’ సంస్థ వ్యవస్థాపకురాలు రేఖా మోడీ అన్నారు. త్వరలోనే కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో షీ లీడ్స్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు.
మహిళల స్వభావంలోనే నాయకత్వ గుణాలు ఉంటాయి. అయితే పురుషాధిక్యత ఆ గుణాలను మాటలతో, చేతలతో ఏళ్లుగా అప్రాముఖ్యం చేస్తూ వస్తోంది. బాధితులు ఎవరైతే అవుతారో సహజంగానే వారి స్వరం ప్రశ్నిస్తుంది. వారి పిడికిలి బిగుస్తుంది. వారి గళం నినదిస్తుంది. అందుకే సామాజికంగా కూడా అణచివేతల్ని, అవకతవకల్ని, దౌర్జన్యాలను చూస్తున్నప్పుడు మహిళలే ముందుగా స్పందిస్తారు. వాళ్లే ఎందుకు ముందుగా స్పందిస్తారంటే.. ప్రతి అపసవ్యత పర్యవసానం చివరికి వారి మీదే పడుతుంది. మరీ ఈ రాజకీయ కోర్సులో చేరడానికి అర్హత ఏమిటి? రాజకీయ రంగ ప్రవేశానికి ఈ కోర్సు దారి చూపుతుందా? మళ్లీ రెండు ప్రశ్నలు. రేషన్ క్యూలో నిలుచుని ఉన్నప్పుడు మీ కంటపడిన డీలర్ అక్రమాన్ని మీరు చూస్తూ ఊరుకోకుండా జనం తరఫున వేలెత్తి చూపిన క్షణమే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు. రాజకీయ శిక్షణలో చేరేందుకు కూడా ఆ అడిగే తత్వమే, నిలదీసే ఆగ్రహమే క్వాలిఫికేషన్.
Comments
Please login to add a commentAdd a comment