ఉద్యోగాల జాతర ఏమైంది?
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం అంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన ఉద్యోగాల జాతర ప్రకటన ఏమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. దిల్‌సుఖ్‌నగర్ అన్నపూర్ణ కల్యాణ మండపంలో జరిగిన నిరుద్యోగుల రాష్ట్ర మహాసభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చే ముందు ఇంటికొక ఉద్యోగమని ప్రకటించిన ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు కనీసం రిటైర్‌మెంట్ వల్ల తెలంగాణలో ఏర్పడ్డ 2 లక్షలు, ఆంధ్రాలో 1.5 లక్షల ఖాళీలను భర్తీ చేయకుండా బడ్జెట్‌ను ఇతర పథకాలకు మళ్లించి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.
ఉద్యోగాల జాతరంటే సిలబస్ ప్రకటించడం, బుక్స్ విడుదల, అవగాహన సదస్సులు పెట్టడం కాదన్నారు. గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక.. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిగో నోటిఫికేషన్... అదిగో డీఎస్సీ అంటూ సీఎం కేసీఆర్, మంత్రుల హామీలను నమ్మే పరిస్థితిలో నిరుద్యోగులు లేరని.. ఉద్యోగాల కోసం సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాష్ట్ర నిరుద్యోగ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ర్యాగ రమేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కులకచర్ల శ్రీనివాస్, సి.రాజేందర్, అంజి, అశోక్, గజం రవి, గీత, వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు.