బీసీ సంక్షేమ సంఘంలో చీలిక
తెలంగాణ సంఘ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌గౌడ్
- సంఘంలో కృష్ణయ్య కొడుకు అరుణ్ జోక్యం పెరిగింది
- ఇకపైనా కృష్ణయ్య నేతృత్వంలోనే పనిచేస్తాం: జాజుల
సాక్షి, హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు బాసటగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం నిట్టనిలువునా చీలింది. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్యా నెలకొన్న అసంతృప్తులు తారస్థాయికి చేరుకుని మంగళ వారం భగ్గుమన్నాయి. బీసీ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్యకు కుడి భుజంగా నిలిచిన ఆ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో.. కొత్త కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 31 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన, మహిళా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలకు చెందిన 400 మంది ప్రతినిధులు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
ఆర్.కృష్ణయ్యే మా నాయకుడు: జాజుల
ఆర్.కృష్ణయ్య తమ నాయకుడని, ఆయనతో విభేదించే పరిస్థితే లేదని, ఆయన నేతృత్వం లోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పని చేస్తుందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశా రు. సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘంలో కృష్ణయ్య కొడుకు డాక్టర్ అరుణ్ జోక్యం బాగా పెరిగిందని, తమకు నచ్చిన వాళ్లకు ఏకపక్షంగా పదవులు కట్ట బెడుతూ ఉద్యమ సంస్థలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే ఎర్ర సత్య నారాయణను తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సంఘంలో గందరగోళం చెలరేగిందన్నారు. దీనిపై ఆర్.కృష్ణయ్య నుంచి స్పష్టత లేకపోవ డంతో తాము విడిగా సమావేశమైనట్లు చెప్పారు.
దశాబ్దాల ఉద్యమంలో చీలిక..
సామాజికంగా వెనుకబడిన కులాల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా 1986లో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భవించింది. బీసీల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాల్లో అగ్ర భాగాన నిలిచింది. బీసీ విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్‌షిప్పుల కోసం.. అలాగే నిరుద్యోగుల కోసం పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘మన రాష్ట్రంలో మన రాజ్యం’ నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీకి శంకర్రావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కొంతకాలంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎర్ర సత్యనారాయణ పేరు ప్రచారంలోకి రావడం, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకపక్షంగా మార్చేయడం తాజా చీలికకు దారితీసింది.
అరుణ్ జోక్యం లేదు: ఆర్.కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘంలో చీలికపై ఆర్.కృష్ణయ్య స్పందించారు. తమది ఉద్యమ సంస్థ అని, ఇందులో తన కొడు కు అరుణ్ జోక్యం ఏమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పదవుల విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని చెప్పారు. అరుణ డాక్టర్ అని, బీసీ సంక్షేమ సంఘంలో అతని పాత్ర పరిమితమన్నారు. ‘ఇది ఉద్యమ సంస్థ. పోరాడిన వాళ్లే ముందు నిలుస్తారు. శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా’అని కృష్ణయ్య చెప్పారు.