Jajula srinivasgaud
-
ఆర్డినెన్స్ ప్రతులు చించిన బీసీ నేతలు
హైదరాబాద్: 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం హేయకరమైన చర్య అని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్ వద్ద ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రతులను చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి మాకు బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలను కలచివేస్తుందన్నారు. పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్లను కల్పించినట్లయితే కేటీఆర్ అన్న మాటను మేము ఆహ్వానించేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా వ్యతిరేకంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు పాల్గొన్నారు. -
బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి
ఎదులాపురం (ఆదిలాబాద్): బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీల రాజకీయ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 21 రోజులు పూర్తి చేసుకుని 22వ రోజు ఆదిలాబాద్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. దేశంలో 56 శాతం, రాష్ట్రంలో 65 శాతం మంది బీసీలు ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 2కోట్ల మంది బీసీలను ఏకం చేయడానికి 36 రోజులు, 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉండగా, ఈ రోజు 24 సీట్లు కేటాయించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బీసీల ఓటు బీసీలకే సీటు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాటా బీసీలకే అనే నినాదంతో తాను రాజకీయ బస్సు యాత్ర ప్రారంభించానన్నారు. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న బీసీలు పార్లమెంటు స్థానాల్లోచివరి వరుసలో ఉన్నారన్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అగ్రవర్ణాలను అధికారం కట్టబెట్టి ఏమైనా కావాలంటే వినతులు సమర్పించి వారిని ఆర్తించాల్సి వస్తోందన్నారు. రాయితీలతో రాజీపడకుండా రాజ్యధికారం సాధించడమే ధ్యేయంగా బీసీలు ఏకం కావాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. జనాభా ప్రకారం బీసీ రాజ్యాధికారం సొంత చేసుకుంటే వినతులు సమర్పించే చేతులతో రేపు వినతులు స్వీకరించే రోజులు వస్తాయన్నారు. డప్పు, చెప్పు తప్ప మిగిలిన అన్ని వృత్తులు బీసీలే చేస్తున్నారని, బీసీలు లేకుంటే ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారిథి, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు దాటర్ల కిష్టు, బీసీ సంఘాల జిల్లా నాయకులు నర్సాగౌడ్, చిక్కాల దత్తు, సామల ప్రశాంత్, ప్రమోద్ ఖత్రి, మంచికట్ల ఆశమ్మ, పసుపుల ప్రతాప్, పి.కిషన్, శ్రీపాద శ్రీనివాస్, అనసూయ, జక్కుల శ్రీనివాస్, వెండి బద్రేశ్వర్‌రావు, శ్రీనివాస్, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలంతా చైతన్యం కావాలి
రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నా రాజకీయంగా అథమంలో ఉన్నారని, వారంతా చైతన్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బస్సు చైతన్యయాత్ర శనివారం డిండి, దేవరకొండ, కొండమల్లేపల్లి, చండూరు, మునుగోడు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక బీసీ నాయకులు స్వాగతం పలికారు. దేవరకొండ / మునుగోడు : దేశంలో ఉన్న బీసీ కులస్తులంగా చైతన్యవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో అగ్రకులాల నాయకులకు ఓట్లు వేయకుండా, బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేసిన రోజునే బీసీల బతులకు మారుతాయని అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజుల క్రితం పాలమూరు జిల్లాలో ప్రారంభించిన బస్సు యాత్ర శనివారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ యాత్ర జిల్లాలో దేవరకొండ, కొండమల్లేపల్లి, మునుగోడు, చండూరు మండల కేంద్రాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సభల్లో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కొన్నేండ్ల నుంచి అగ్రకులాల నాయకులు బీసీల చేత చేయించుకుంటున్న రాజకీయ గులాంగిరీలని అంతమొందించేందుకే ఈ బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు తమ ఆధిపత్య పోరుతో ఎంపీ, ఎమ్మెల్యేలుగా చెలామనీ అవుతున్న దొరలకు రానున్న 2019 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రాణాలను త్యాగం చేసైనా రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలని గెలిపించుకుంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. మళ్లీ దొరలు పదువులను దక్కించుకుని విద్యా, రాజకీయంగా అణచివేస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 2009 ఎన్నికల వరకు కేవలం ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందన్నారు. 2014లో అదికూడా లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 6 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీని గెలిపించుకునేందుకు బీసీలంతా నడుం బిగించాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఫెడరేషన్ పేరు మీద రుణాలు అందించాలని కోరారు. రాష్రంలో 56శాతం ఉన్న బీసీలకు ఉన్నత పదవులు దక్కకుండా కేవలం 5శాతం ఉన్న అగ్రకులాల వారు అందల మెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో బూడిద లింగయ్యయాదవ్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, రిటైడ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, బొడ్డు నాగరాజుగౌడ్, గుంటోజు వెంకటాచారి, బీజేపీ మండల అధ్యక్షుడు బొడిగె అశోక్‌గౌడ్, డోల్‌దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మాలిగ యాదయ్య, నర్సింహాచారి, పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లికార్జున్‌యాదవ్, క్రిష్ణ, లాస్‌గౌడ్, సాగర్ల లింగస్వామి, జాజుల భాస్కర్‌గౌడ్, సరికొండ జనార్దన్‌రాజు, గుంజ కృష్ణయ్య, నేతాళ్ల వెంకటేష్‌యాదవ్, ఎన్ఎన్.చారి, పున్న శైలజ, గుర్రం విజయలక్ష్మి, ఇడికుడ అలివేలు, చేరిపల్లి జయలక్ష్మి, పగిడిమర్రి సంపూర్ణ, సుజాత, శిరందాసు కృష్ణయ్య, వనం చంద్రమౌళి, ముచ్చర్ల ఏడుకొండలు, విజయ్, మురారి, రాఘవాచారి, చింతపల్లి పుల్లయ్య, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్రంలో బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా దక్కే వరకు బీసీలంతా ఒక్కటై ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచి రావాల్సిన వాటాను సాధించుకోవాలన్నారు. శుక్రవారం ‘కేంద్ర–రాష్ట్ర బడ్జెట్లలో బీసీల వాటా’అనే అంశంపై జరిగిన సమావేశంలో 80 బీసీ కుల సంఘాలు, 20 బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాలను జాగృతం చేసేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో బీసీ భవన్.. బీసీల జాబితాలో ఉన్న అన్ని కులాలకు 10 ఎకరాల భూమి, రూ.10 కోట్ల కేటాయింపు. మహాత్మ జ్యోతిభాపూలే పేరుతో హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో బీసీ భవన్ ఏర్పాటు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కోటా. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయింపులు. బీసీ కులాల ఫెడరేషన్లకు పాలక మండళ్ల నియామకం. కులవృత్తుల వారికి ఫెడరేషన్ల ఏర్పాటు. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వేయి కోట్లు తక్షణ విడుదల. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంపు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని బీసీల రాజకీయ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు చేశారు. -
బీసీ సంక్షేమ సంఘంలో చీలిక
తెలంగాణ సంఘ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ - సంఘంలో కృష్ణయ్య కొడుకు అరుణ్ జోక్యం పెరిగింది - ఇకపైనా కృష్ణయ్య నేతృత్వంలోనే పనిచేస్తాం: జాజుల సాక్షి, హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు బాసటగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం నిట్టనిలువునా చీలింది. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్యా నెలకొన్న అసంతృప్తులు తారస్థాయికి చేరుకుని మంగళ వారం భగ్గుమన్నాయి. బీసీ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్యకు కుడి భుజంగా నిలిచిన ఆ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో.. కొత్త కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 31 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన, మహిళా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలకు చెందిన 400 మంది ప్రతినిధులు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆర్.కృష్ణయ్యే మా నాయకుడు: జాజుల ఆర్.కృష్ణయ్య తమ నాయకుడని, ఆయనతో విభేదించే పరిస్థితే లేదని, ఆయన నేతృత్వం లోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పని చేస్తుందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశా రు. సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘంలో కృష్ణయ్య కొడుకు డాక్టర్ అరుణ్ జోక్యం బాగా పెరిగిందని, తమకు నచ్చిన వాళ్లకు ఏకపక్షంగా పదవులు కట్ట బెడుతూ ఉద్యమ సంస్థలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే ఎర్ర సత్య నారాయణను తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సంఘంలో గందరగోళం చెలరేగిందన్నారు. దీనిపై ఆర్.కృష్ణయ్య నుంచి స్పష్టత లేకపోవ డంతో తాము విడిగా సమావేశమైనట్లు చెప్పారు. దశాబ్దాల ఉద్యమంలో చీలిక.. సామాజికంగా వెనుకబడిన కులాల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా 1986లో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భవించింది. బీసీల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాల్లో అగ్ర భాగాన నిలిచింది. బీసీ విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్‌షిప్పుల కోసం.. అలాగే నిరుద్యోగుల కోసం పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘మన రాష్ట్రంలో మన రాజ్యం’ నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీకి శంకర్రావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కొంతకాలంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎర్ర సత్యనారాయణ పేరు ప్రచారంలోకి రావడం, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకపక్షంగా మార్చేయడం తాజా చీలికకు దారితీసింది. అరుణ్ జోక్యం లేదు: ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘంలో చీలికపై ఆర్.కృష్ణయ్య స్పందించారు. తమది ఉద్యమ సంస్థ అని, ఇందులో తన కొడు కు అరుణ్ జోక్యం ఏమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పదవుల విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని చెప్పారు. అరుణ డాక్టర్ అని, బీసీ సంక్షేమ సంఘంలో అతని పాత్ర పరిమితమన్నారు. ‘ఇది ఉద్యమ సంస్థ. పోరాడిన వాళ్లే ముందు నిలుస్తారు. శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా’అని కృష్ణయ్య చెప్పారు.