బీసీ సంఘాల సమావేశంలో జాజుల తదితరులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్రంలో బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా దక్కే వరకు బీసీలంతా ఒక్కటై ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచి రావాల్సిన వాటాను సాధించుకోవాలన్నారు. శుక్రవారం ‘కేంద్ర–రాష్ట్ర బడ్జెట్‌లలో బీసీల వాటా’అనే అంశంపై జరిగిన సమావేశంలో 80 బీసీ కుల సంఘాలు, 20 బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాలను జాగృతం చేసేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో బీసీ భవన్..
బీసీల జాబితాలో ఉన్న అన్ని కులాలకు 10 ఎకరాల భూమి, రూ.10 కోట్ల కేటాయింపు. మహాత్మ జ్యోతిభాపూలే పేరుతో హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో బీసీ భవన్ ఏర్పాటు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కోటా. బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయింపులు. బీసీ కులాల ఫెడరేషన్లకు పాలక మండళ్ల నియామకం. కులవృత్తుల వారికి ఫెడరేషన్ల ఏర్పాటు. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వేయి కోట్లు తక్షణ విడుదల. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంపు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని బీసీల రాజకీయ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment