బీసీలు రాజ్యాధికారం  సొంతం చేసుకోవాలి | BC Welfare Association Jajula Srinivas Goud Comments On TRS Govt | Sakshi
Sakshi News home page

బీసీలు రాజ్యాధికారం  సొంతం చేసుకోవాలి

Published Wed, Aug 29 2018 12:29 PM | Last Updated on Wed, Aug 29 2018 12:29 PM

BC Welfare Association Jajula Srinivas Goud Comments On TRS Govt - Sakshi

మాట్లాడుతున్న బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

ఎదులాపురం (ఆదిలాబాద్‌): బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బీసీల రాజకీయ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 21 రోజులు పూర్తి చేసుకుని 22వ రోజు ఆదిలాబాద్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. దేశంలో 56 శాతం, రాష్ట్రంలో 65 శాతం మంది బీసీలు ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 2కోట్ల మంది బీసీలను ఏకం చేయడానికి 36 రోజులు, 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు.

జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉండగా, ఈ రోజు 24 సీట్లు కేటాయించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బీసీల ఓటు బీసీలకే సీటు, పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు బీసీ వాటా బీసీలకే అనే నినాదంతో తాను రాజకీయ బస్సు యాత్ర ప్రారంభించానన్నారు. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న బీసీలు పార్లమెంటు స్థానాల్లోచివరి వరుసలో ఉన్నారన్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అగ్రవర్ణాలను అధికారం కట్టబెట్టి ఏమైనా కావాలంటే వినతులు సమర్పించి వారిని ఆర్తించాల్సి వస్తోందన్నారు. రాయితీలతో రాజీపడకుండా రాజ్యధికారం సాధించడమే ధ్యేయంగా బీసీలు ఏకం కావాలని శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపు నిచ్చారు.

జనాభా ప్రకారం బీసీ రాజ్యాధికారం సొంత చేసుకుంటే వినతులు సమర్పించే చేతులతో రేపు వినతులు స్వీకరించే రోజులు వస్తాయన్నారు. డప్పు, చెప్పు తప్ప మిగిలిన అన్ని వృత్తులు బీసీలే చేస్తున్నారని, బీసీలు లేకుంటే ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారిథి, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు దాటర్ల కిష్టు, బీసీ సంఘాల జిల్లా నాయకులు నర్సాగౌడ్, చిక్కాల దత్తు, సామల ప్రశాంత్, ప్రమోద్‌ ఖత్రి, మంచికట్ల ఆశమ్మ, పసుపుల ప్రతాప్, పి.కిషన్, శ్రీపాద శ్రీనివాస్, అనసూయ, జక్కుల శ్రీనివాస్, వెండి బద్రేశ్వర్‌రావు, శ్రీనివాస్, ప్రసాద్, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అభివాదం చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘం నాయకులు1
1/2

2
2/2

సమావేశంలో పాల్గొన్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement