
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ అణచివేతకు నిరసనగా ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 105 మందిలో 21 మంది బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వడంపై మండి పడ్డారు.
బీజేపీ 66 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 14 మంది బీసీలకే అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు కలిపి 40 నుంచి 50 సీట్లే కేటాయించడాన్ని వ్యతిరేకించారు. 11న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్‌లు ఇస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ తో అదే రోజు నిరసనలకు పిలుపునిచ్చారు.