
ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఉద్యమిస్తాం: కృష్ణయ్య
తెలంగాణలో రెండు లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి ప్రభుత్వాలు నోటిఫికేషన్ ...
హైదరాబాద్: తెలంగాణలో రెండు లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి ప్రభుత్వాలు నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఉద్యమం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిరుద్యోగుల గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ప్రకటనలకే పరిమితమైందని ఆచరణలో లేదని విమర్శించారు. ఈ ఏడాది డీఎస్సీ లేదని ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 6 నెలల్లో ఉద్యోగాల జాతర ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడాదిన్నరలో 770 ఇంజనీరింగ్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారని విమర్శించారు.
నిరుద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, నిరుద్యోగ గర్జన సమన్వయకర్త గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, బీసీ మ హిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదాగౌడ్, తెలంగాణ బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, బీసీ కళామండలి అధ్యక్షుడు రామలింగం పాల్గొన్నారు.