కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు | Court does not mind the orders on governament | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు

Published Tue, Dec 25 2018 5:39 AM | Last Updated on Tue, Dec 25 2018 6:28 AM

Court does not mind the orders on governament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌పై కోర్టు స్పందించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, గణాంకాల డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సైదా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ధర్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బీసీ జానాభా కోసం పలు పిటిషన్లు
బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, బి.రవీంద్రనాథ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన లెక్కల్లో బీసీ జనాభా ఎంత ఉందో బహిర్గతం చేసి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్‌ రాజు సంయుక్త మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ తరువాత ఆ వివరాలను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, ఇవన్నీ పూర్తి చేసిన తరువాతనే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ ఏడాది జూన్‌ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  

ప్రభుత్వానిది కోర్టు ధిక్కారమే...
ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బీసీ జనాభా గణనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బీసీ జనాభాను తేల్చకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోందంటూ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు సోమవారం విచారించారు. బీసీ జనాభాను తేల్చకుండా ఎన్నికలు నిర్వహించడం కోర్టు ధిక్కారమే అవుతుందని జాజుల తరఫు న్యాయవాది రామచంద్రగౌడ్‌ కోర్టుకు నివేదించారు. అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అధికారులందరికీ నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement