petition in court
-
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేశా
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు తొలిసారి అధికారికంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ప్రత్యేక మైన అధికారాలు లేవని, అప్పటి డీజీపీ, నిఘా విభాగం అధిపతి పర్యవేక్షణలోనే తాను పని చేశానని చెప్పారు. పోలీసుల పిటిషన్ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిన ప్రభాక ర్రావు వైద్యం పేరుతో అక్కడే ఉన్నారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మాట్లాడటం మినహా ఇప్పటివరకు దేనిపైనా స్పందించలేదు. అయితే పంజగుట్ట పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్టు వారెంట్ కోసం పిటిషన్ వేయడంతో మౌనం వీడారు. ఆయనతో పాటు ఓ మీడియా సంస్థ అధినేత శ్రావణ్‌కుమార్‌పై అరెస్టు వారెంట్లు కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అలా వారెంట్లు జారీ చేయవద్దని కోరుతూ ప్రభాకర్‌రావుతో పాటు శ్రావణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన న్యాయవాది వి.సురేందర్‌రావు ద్వారా వేసిన పిటిషన్లో ప్రభాకర్‌రావు పలు అంశాలు ప్రస్తావించారు.అనుభవం దృష్ట్యానే..దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నట్లు తాను ఎస్ఐబీ చీఫ్ కావడానికి సామాజిక వర్గం కారణం కాదని, తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే నాటి డీజీపీ ఎంపిక చేశారని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ ఎస్పీగా పని చేస్తున్న తనను రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి హఠాత్తుగా బదిలీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తనకు డీఐజీ నుంచీ ఐజీగా రావాల్సిన పదోన్నతి కూడా చాలా ఆలస్యమైందని తెలిపారు. తాను అమెరికా వెళ్లడానికి కారణం కేసుల భయం కాదని, వైద్యం కోసమే అని వివరించారు. అది పూర్తయిన తర్వాత స్వదేశానికి వస్తానని కోర్టుకు తెలిపారు. సోదరి అనారోగ్య కారణాల నేపథ్యంలో తాను అమెరికా వెళ్లినట్లు శ్రావణ్‌కుమార్ కూడా తన న్యాయవాది (సురేందర్‌రావు) ద్వారా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
నిందితులను మా కస్టడీకి ఇవ్వండి
సాక్షి, షాద్‌నగర్ టౌన్: ‘దిశ’ను అత్యాచారం, హత్య చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం కోర్టుకు వచ్చిన పోలీసులు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో లేకపోవడంతో కొద్ది సేపటికే వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం కోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉందని, పది రోజుల కస్టడీ కావాలని పిటిషన్లో కోరినట్లు సమాచారం. కస్టడీపై కోర్టు తమ నిర్ణయాన్ని నేడు వెల్లడించనుంది. కాగా, నిందితులను చర్లపల్లి జైలు నుంచి షాద్‌నగర్ కోర్టుకు తీసుకొస్తున్నారన్న పుకార్లతో జనం పెద్ద ఎత్తున కోర్టు వద్దకు వచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు నేడు తుది నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనకు అనుమతి లేదన్నారు. కాగా షాద్‌నగర్‌లో నిరసనలు అట్టుడుకుతున్నందున అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశముంది. -
కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌పై కోర్టు స్పందించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, గణాంకాల డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సైదా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ధర్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ జానాభా కోసం పలు పిటిషన్లు బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, బి.రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన లెక్కల్లో బీసీ జనాభా ఎంత ఉందో బహిర్గతం చేసి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్ రాజు సంయుక్త మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ తరువాత ఆ వివరాలను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, ఇవన్నీ పూర్తి చేసిన తరువాతనే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ ఏడాది జూన్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానిది కోర్టు ధిక్కారమే... ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బీసీ జనాభా గణనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బీసీ జనాభాను తేల్చకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోందంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం విచారించారు. బీసీ జనాభాను తేల్చకుండా ఎన్నికలు నిర్వహించడం కోర్టు ధిక్కారమే అవుతుందని జాజుల తరఫు న్యాయవాది రామచంద్రగౌడ్ కోర్టుకు నివేదించారు. అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అధికారులందరికీ నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు. -
చిక్కుల్లో పోలీస్ బాస్
పోలీస్ బాస్ చిక్కుల్లో పడ్డారు. గుట్కా అక్రమ అమ్మకాల్లో అవినీతి ఆరోపణలు, తన నియామకం, అవినీతి ఆరోపణలపై వివరణలు కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ చీఫ్ కమిషనర్‌కు మదురై కోర్టు జారీ చేసిన ఆదేశాలు తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ⇒ పొడిగింపును సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ ⇒ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖకు కోర్టు ఆదేశాలు ⇒ డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశం నిందితులు తప్పించుకోలేరు: పొన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: డీజీపీగా రాజేంద్రన్ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. సర్వీసులో ఉన్న ఎందరో సీనియర్ ఐపీఎస్‌లు డీజీపీగా పదోన్నతి లభించక వెంపర్లాడుతుండగా ఉద్యోగ విరమణ వయస్సు దాటిపోయిన రాజేంద్రన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడంపై ఆక్షేపణలు మొదలయ్యాయి. అలాగే నిషేధిత గుట్కా, పాన్ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్ సైతం ఒక నిందితుడని ఒక ఇంగ్లిషు టీవీ చానల్ ఆధారాలు సహా బైటపెట్టి కలకలం రేపింది. గుట్కా వ్యవహారం నుంచి రాజేంద్రన్‌ను తప్పించేందుకే పదవీకాలాన్ని పొడిగించినట్లుగా మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్ హైకోర్టు మదురై శాఖలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌ల ముందుకు గురువారం విచారణకు వచ్చింది. పిటిషన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ గుట్కా స్థావరాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని, అందులో రాష్ట్ర మంత్రులు, సీనీయర్ ఐపీఎస్ అధికారులు లంచం పుచ్చుకున్నట్లు పేర్కొని ఉన్నారని చెప్పారు. గుట్కా స్థావరాలపై దాడులు జరిగినప్పుడు చెన్నై పోలీస్ కమిషనర్‌గా రాజేంద్రనే ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. గుట్కా అక్రమ అమ్మకాల్లో భాగస్వామ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఐటీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి లేఖరాశారని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. ఎన్నో ఆధారాలతో ఐటీ సమర్పించిన ఉత్తరాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అయితే అప్పటి డీజీపీ ఐటీ ఇచ్చిన ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధకశాఖ సిఫారసు చేశారని అన్నారు. ఈ కారణంగానే సదరు డీజీపీ చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన కోర్టుకు తెలిపారు. డీజీపీగా నియామకం ముందు రాజేంద్రన్‌పై ఉన్న ఆరోపణలను యూపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లకుండా కప్పిపెట్టారని విమర్శించారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ సాగుతోందని ముఖ్యమంత్రి ఎడపాడి అసెంబ్లీలో అంగీకరించినందున నిందితుడిగా ఉన్న రాజేంద్రన్ డీజీపీగా కొనసాగేందుకు వీలులేదని ఆయన వాదించారు. డాక్యుమెంట్లు సమర్పించండి: న్యాయమూర్తులు పిటిషన్‌దారు వాదన విన్న అనంతరం న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. డీజీపీ నియామకం సమయంలో యూపీఎస్సీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు సమర్పించాలి. ఐటీ తనిఖీలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతిని«ధులపై అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన పత్రాలను ఐటీ చీఫ్ కమిషనర్ కోర్టుకు సమర్పించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు వెంటనే చేపట్టిన చర్యలు, విచారణకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ కోర్టుకు సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లను సీల్ చేసిన కవరులో కోర్టుకు అందజేయాలి. ఈ డాక్యుమెంట్లను కోరినందున డీజీపీ నియామకంపై కోర్టు ఏదో నిర్ణయం తీసుకుందని భావించరాదని న్యాయమూర్తులు పేర్కొంటూ ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. నిందితులు తప్పించుకోలేరు: కేంద్ర మంత్రి పొన్ గుట్కా వ్యవహారంలో భాగస్వాములైన నిందితులను ఎవరూ తప్పించకూడదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మదురై తిరుప్పరగున్రంలో శుక్రవారం మీడియాతో అన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
మిస్టరీ ముడి విప్పండి!
♦ మళ్లీ తెరపైకి ‘అమ్మ’ మరణం ♦ మిస్టరీ ఛేదించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ♦ శశికళ, పన్నీర్ సహా 186 మందిపై ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్త కలకలానికి కారణమైన అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మళ్లీ తెరపైకి వచ్చింది. అమ్మ మరణం మిస్టరీగా మారడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ప్రధాన కార్యదర్శి శశికళ సహా 186 మందిపై కేసులు పెట్టాలని కోరుతూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జ్వరం, డీహైడ్రేషన్ అస్వస్థతతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇక ప్రాణంతో తిరిగిరాలేదు. గత ఏడాది సెప్టంబర్ 22 నుంచి డిసెంబర్ 5వ తేదీన ఆమె మరణించిందని ప్రకటించే వరకు అంతా గోప్యంగా ఉంచారు. ప్రజలు, పార్టీ నేతలు కోరినా చికిత్స పొందుతున్న జయ ఫొటోను విడుదల చేయలేదు. అమ్మ కోలుకుంటున్నారు, నేడో రేపో డిశ్చార్జ్ అని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు చివరి వరకు ప్రకటిస్తూనే ఉన్నారు. జయ మరణం తరువాత అదే పార్టీకి చెందిన న్యాయవాది పుహళేంది అన్నాడీఎంకే కార్యకర్తల యువజన విభాగాన్ని స్థాపించాడు. ఈ విభాగంలోని కడలూరుకు చెందిన అన్నాడీఎంకే న్యాయవాది సెల్వవినాయగం అమ్మ మరణం వెనుక శశికళ, పన్నీర్‌సెల్వం హస్తం ఉందంటూ గత నెల తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో న్యాయవాది పుహళేంది చెన్నై సైదాపేట 18వ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశాడు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె బాగా కోలుకుంటున్నట్లుగా అపోలో యాజమాన్యం విడుదల చేసిన బులిటెన్లలో పేర్కొందని, అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా 2016, డిసెంబర్ 5వ తేదీన రాత్రి 11.30 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె ప్రాణాలు తీశారని, ఈ నేరంలో శశికళ, పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే నిర్వాహకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అపోలో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం 186 మంది పాత్ర ఉందని పిటిషన్లో చేర్చాడు. ఈ 186 మందిపై కేసులు నమోదు చేయాల్సిందిగా తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోనందున తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టును కోరాడు. జయ మరణంపై కేసులు పెట్టేవరకు తమ పోరాటం ఆగదని న్యాయవాది పుహళేంది మీడియాకు తెలిపారు.