చిక్కుల్లో పోలీస్ బాస్
పోలీస్ బాస్ చిక్కుల్లో పడ్డారు. గుట్కా అక్రమ అమ్మకాల్లో అవినీతి ఆరోపణలు, తన నియామకం, అవినీతి ఆరోపణలపై వివరణలు కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ చీఫ్ కమిషనర్‌కు మదురై కోర్టు జారీ చేసిన ఆదేశాలు తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
⇒ పొడిగింపును సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్
⇒ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖకు కోర్టు ఆదేశాలు
⇒ డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశం నిందితులు తప్పించుకోలేరు: పొన్
సాక్షి ప్రతినిధి, చెన్నై:
డీజీపీగా రాజేంద్రన్ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. సర్వీసులో ఉన్న ఎందరో సీనియర్ ఐపీఎస్‌లు డీజీపీగా పదోన్నతి లభించక వెంపర్లాడుతుండగా ఉద్యోగ విరమణ వయస్సు దాటిపోయిన రాజేంద్రన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడంపై ఆక్షేపణలు మొదలయ్యాయి. అలాగే నిషేధిత గుట్కా, పాన్ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్ సైతం ఒక నిందితుడని ఒక ఇంగ్లిషు టీవీ చానల్ ఆధారాలు సహా బైటపెట్టి కలకలం రేపింది.
గుట్కా వ్యవహారం నుంచి రాజేంద్రన్‌ను తప్పించేందుకే పదవీకాలాన్ని పొడిగించినట్లుగా మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్ హైకోర్టు మదురై శాఖలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌ల ముందుకు గురువారం విచారణకు వచ్చింది. పిటిషన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ గుట్కా స్థావరాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని, అందులో రాష్ట్ర మంత్రులు, సీనీయర్ ఐపీఎస్ అధికారులు లంచం పుచ్చుకున్నట్లు పేర్కొని ఉన్నారని చెప్పారు. గుట్కా స్థావరాలపై దాడులు జరిగినప్పుడు చెన్నై పోలీస్ కమిషనర్‌గా రాజేంద్రనే ఉన్నాడని ఆయన గుర్తు చేశారు.
గుట్కా అక్రమ అమ్మకాల్లో భాగస్వామ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఐటీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి లేఖరాశారని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. ఎన్నో ఆధారాలతో ఐటీ సమర్పించిన ఉత్తరాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అయితే అప్పటి డీజీపీ ఐటీ ఇచ్చిన ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధకశాఖ సిఫారసు చేశారని అన్నారు. ఈ కారణంగానే సదరు డీజీపీ చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన కోర్టుకు తెలిపారు. డీజీపీగా నియామకం ముందు రాజేంద్రన్‌పై ఉన్న ఆరోపణలను యూపీఎస్‌సీ దృష్టికి తీసుకెళ్లకుండా కప్పిపెట్టారని విమర్శించారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ సాగుతోందని ముఖ్యమంత్రి ఎడపాడి అసెంబ్లీలో అంగీకరించినందున నిందితుడిగా ఉన్న రాజేంద్రన్ డీజీపీగా కొనసాగేందుకు వీలులేదని ఆయన వాదించారు.
డాక్యుమెంట్లు సమర్పించండి: న్యాయమూర్తులు
పిటిషన్‌దారు వాదన విన్న అనంతరం న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. డీజీపీ నియామకం సమయంలో యూపీఎస్‌సీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు సమర్పించాలి. ఐటీ తనిఖీలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతిని«ధులపై అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన పత్రాలను ఐటీ చీఫ్ కమిషనర్ కోర్టుకు సమర్పించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు వెంటనే చేపట్టిన చర్యలు, విచారణకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ కోర్టుకు సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లను సీల్ చేసిన కవరులో కోర్టుకు అందజేయాలి. ఈ డాక్యుమెంట్లను కోరినందున డీజీపీ నియామకంపై కోర్టు ఏదో నిర్ణయం తీసుకుందని భావించరాదని న్యాయమూర్తులు పేర్కొంటూ ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు.
నిందితులు తప్పించుకోలేరు: కేంద్ర మంత్రి పొన్
గుట్కా వ్యవహారంలో భాగస్వాములైన నిందితులను ఎవరూ తప్పించకూడదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మదురై తిరుప్పరగున్రంలో శుక్రవారం మీడియాతో అన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.