![Vijayawada Patamata police filed a petition in court on Friday seeking police custody of Vamsi Mohan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/vamshi.jpg.webp?itok=wyC8JeHQ)
వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ కోసం బరితెగింపు
యథేచ్ఛగా దర్యాప్తు మార్గదర్శకాల ఉల్లంఘన
అక్రమ కేసు కుట్ర బట్టబయలవ్వడంపై పెద్దల ఆగ్రహం
ఎలాగైనా వంశీని అరెస్ట్ చేయాలంటూ ఆదేశం
చంద్రబాబు కుట్రకు పోలీసుల వత్తాసు
సీఆర్‌పీసీ 164 వాంగ్మూలానికి విలువ ఇవ్వని వైనం
తప్పుడు కేసు పెట్టించి కక్ష సాధింపు
పది రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ లీగల్/ పటమట (విజయవాడ తూర్పు) : రెడ్‌బుక్ రాజ్యాంగంతో విధ్వంసం సృష్టించడం, అక్రమ అరెస్టులకు తెగబడటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. అందుకు జీ.. హుజూర్ అంటూ పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తూ, అత్యంత కీలకమైన న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను కూడా ఉల్లంఘిస్తూ బరి తెగిస్తున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అక్రమ అరెస్ట్ ద్వారా తమ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల తీవ్రత.. రాజ్యాంగ ఉల్లంఘనలో బరితెగింపును మరోసారి బాహాటంగా చాటి చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు పేరుతో వల్లభనేని వంశీపై నమోదు చేసిన అక్రమ కుట్ర కేసు బెడిసి కొట్టడంతో ప్రభుత్వ పెద్దలు తమ కుతంత్రానికి మరింత పదును పెట్టారు. పోలీసు దర్యాప్తు ప్రాథమిక విధి విధానాలు, న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ మరో అక్రమ కేసుతో విరుచుకు పడటం పట్ల సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది.
సత్యవర్థన్‌ను విచారించకుండానే వంశీ అరెస్ట్
సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ బెదిరించి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారనే కట్టుకథను పోలీసులు తెరపైకి తెచ్చారు. అందుకోసం ఆయన తమ్ముడు కిరణ్‌ను తమదైన శైలిలో బెదిరించి మరీ రంగం సిద్ధం చేశారు. ఆయన్ను ఏకంగా మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి, బెదిరించి మరీ తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఆయన తన అన్న సత్యవర్థన్‌ను బెదిరించి వాంగ్మూలం ఇప్పించి కేసు ఉపసంహరింపజేశారని ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం.
కానీ ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాధ్యతాయుతంగా ముందుగా సత్యవర్థన్‌ను విచారించాలి. ఆయన అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు సరైందా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. ఈ దర్యాప్తు ప్రమాణాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఉన్న సత్యవర్థన్‌ను తీసుకువచ్చేందుకు పోలీసు బృందాలు అక్కడకు వెళ్లాయి.
మరోవైపు సత్యవర్థన్‌ను విచారించకముందే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నాయి. తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారన్న కనీస సమాచారం ఇవ్వకుండానే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి బలవంతంగా విజయవాడకు తరలించారు.
164 సీఆర్‌పీసీ వాంగ్మూలం అంటే లెక్కేలేదు
దర్యాప్తు, విచారణ ప్రక్రియలో సీఆర్‌పీసీ 164 వాంగ్మూలం ఎంతో కీలకమైంది. పోలీసులు అక్రమ అరెస్టు్టలు, బెదిరింపులకు పాల్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగం సీఆర్‌పీసీ 164 వాంగ్మూలానికి అవకాశం కల్పించింది. అంటే సాక్షులు, బాధితులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ధైర్యంగా, స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వొచ్చు.
న్యాయ విచారణ ప్రక్రియలో ఆ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది. స్వచ్ఛందంగానే వాంగ్మూలం ఇస్తున్నారు కదా అని న్యాయమూర్తి అడిగి మరీ నమోదు చేస్తారు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇస్తే అది క్రిమినల్ నేరం కూడా అవుతుందన్నది పోలీసులకు పూర్తి అవగాహన ఉంది.
అయినా సరే చంద్రబాబు మెప్పు కోసం రాజ్యంగ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘించి మరీ బరితెగించారు. సత్యవర్థన్ స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట సీఆర్‌పీసీ 164 వాంగ్మూలం ఇస్తే... ఆ వాంగ్మూలం తప్పని ఆయన అన్నయ్యతో ఫిర్యాదు చేయించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం.
కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణ
కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ను పోలీసు కస్టడీకి కోరుతూ శుక్రవారం విజయవాడ పటమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం వంశీమోహన్ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/7_15.jpg)
ఆయన్ను పది రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని, అతని సెల్ ఫోన్‌ను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పెద్ద అవుటపల్లికి చెందిన వేల్పూరు వంశీని, గన్నవరానికి చెందిన వీర్రాజులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.
కుట్ర బట్టబయలు.. చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహం
గన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అక్రమ కేసు బనాయించిన కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు, లోకేశ్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని తనకు తెలియకుండానే తన పేరిట ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని సత్యవర్థన్ న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు.
దాంతో రెడ్‌బుక్ కుట్రలో భాగంగానే వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారన్నది న్యాయస్థానం సాక్షిగా బట్టబయలైంది. తమ కుట్ర బహిర్గతం కావడంతో చంద్రబాబు, లోకేశ్‌లు ఆగ్రహంతో చిందులు తొక్కినట్టు సమాచారం. ఎలాగైనా వంశీని అరెస్ట్ చేయల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో డీజీపీ కార్యాలయం కేంద్రంగా అప్పటికప్పుడు కొత్త కుట్రకు తెరతీశారు.
వంశీది పైచేయి అయిందని అక్కసు
ముదునూరి సత్యవర్ధన్ కోర్టులో ఇచ్చిన కీలక వాంగూ్మలం కూటమి ప్రభుత్వానికి అవమానభారంగా మారింది. గత సోమవారం ఆయన స్వచ్ఛందంగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరై కేసును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆఫిడవిట్ సమర్పించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన ప్రభుత్వ పెద్దలు.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేపై చిందులు తొక్కారు. ఈ కేసులో కీలకమైన ఫిర్యాదుదారుడిని కంట్రోల్‌లో ఉంచుకోవడంలో వైఫల్యం చెందారంటూ మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వల్లభనేని వంశీమోహన్ ఈ కేసులో పైచేయి ఎలా సాధిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎలాగైనా సరే వంశీమోహన్‌ను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయాల్సిందేనని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో పోలీసులు సత్యవర్ధన్ తల్లిదండ్రులు, సోదరుడిని తమ అధీనంలోకి తీసుకుని.. వారిని తీవ్రంగా బెదిరించి, ప్రలోభపెట్టి కథ నడిపించారు.
తమకు అనుకూలంగా ఫిర్యాదు తీసుకుని బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కుట్రలో భాగంగా సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకోవడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవితో కూడా ఫిర్యాదు చేయించి, ఆ మేరకు వంశీమోహన్‌పై ఇంకో కేసు నమోదు చేశారు.
హైకోర్టు తీర్పునూ ఖాతరు చేయలేదు
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీమోహన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఏ కేసు నిమిత్తం వంటి వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాïపీ ఇవ్వకుండానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఆయన్ను విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత కనీస వైద్య సాయం అందించేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. ఆయన సతీమణి పంకజ శ్రీ, న్యాయవాదులను కలిసేందుకు కూడా అంగీకరించలేదు. తుదకు ఆమె ఆందోళనకు దిగడంతో కలిసేందుకు అంగీకరించారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లే విషయంలో, కోర్టు నుండి రిమాండ్‌కు తరలించే సమయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా ఆయన్ను ఇబ్బందులకు గురిచేశారు.
కాగా, ఈ కేసులో వంశీపై ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్‌సీపీ నేతలు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment