నాకెలాంటి ప్రత్యేక అధికారాలు లేవు
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టులో పిటిషన్
అరెస్టు వారెంటు ఇవ్వొద్దని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు తొలిసారి అధికారికంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ప్రత్యేక మైన అధికారాలు లేవని, అప్పటి డీజీపీ, నిఘా విభాగం అధిపతి పర్యవేక్షణలోనే తాను పని చేశానని చెప్పారు. పోలీసుల పిటిషన్ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిన ప్రభాక ర్‌రావు వైద్యం పేరుతో అక్కడే ఉన్నారు.
కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మాట్లాడటం మినహా ఇప్పటివరకు దేనిపైనా స్పందించలేదు. అయితే పంజగుట్ట పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్టు వారెంట్ కోసం పిటిషన్ వేయడంతో మౌనం వీడారు. ఆయనతో పాటు ఓ మీడియా సంస్థ అధినేత శ్రావణ్‌కుమార్‌పై అరెస్టు వారెంట్లు కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అలా వారెంట్లు జారీ చేయవద్దని కోరుతూ ప్రభాకర్‌రావుతో పాటు శ్రావణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన న్యాయవాది వి.సురేందర్‌రావు ద్వారా వేసిన పిటిషన్‌లో ప్రభాకర్‌రావు పలు అంశాలు ప్రస్తావించారు.
అనుభవం దృష్ట్యానే..
దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నట్లు తాను ఎస్‌ఐబీ చీఫ్ కావడానికి సామాజిక వర్గం కారణం కాదని, తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే నాటి డీజీపీ ఎంపిక చేశారని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ ఎస్పీగా పని చేస్తున్న తనను రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి హఠాత్తుగా బదిలీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తనకు డీఐజీ నుంచీ ఐజీగా రావాల్సిన పదోన్నతి కూడా చాలా ఆలస్యమైందని తెలిపారు.
తాను అమెరికా వెళ్లడానికి కారణం కేసుల భయం కాదని, వైద్యం కోసమే అని వివరించారు. అది పూర్తయిన తర్వాత స్వదేశానికి వస్తానని కోర్టుకు తెలిపారు. సోదరి అనారోగ్య కారణాల నేపథ్యంలో తాను అమెరికా వెళ్లినట్లు శ్రావణ్‌కుమార్ కూడా తన న్యాయవాది (సురేందర్‌రావు) ద్వారా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment