
కోర్టువద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తున్న దృశ్యం
సాక్షి, షాద్‌నగర్ టౌన్: ‘దిశ’ను అత్యాచారం, హత్య చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం కోర్టుకు వచ్చిన పోలీసులు ఇన్‌చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో లేకపోవడంతో కొద్ది సేపటికే వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం కోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉందని, పది రోజుల కస్టడీ కావాలని పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. కస్టడీపై కోర్టు తమ నిర్ణయాన్ని నేడు వెల్లడించనుంది. కాగా, నిందితులను చర్లపల్లి జైలు నుంచి షాద్‌నగర్ కోర్టుకు తీసుకొస్తున్నారన్న పుకార్లతో జనం పెద్ద ఎత్తున కోర్టు వద్దకు వచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు నేడు తుది నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనకు అనుమతి లేదన్నారు. కాగా షాద్‌నగర్‌లో నిరసనలు అట్టుడుకుతున్నందున అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment