సాక్షి, హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసింది. నగరంలోని కేర్ ఆస్పత్రిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌లను కలిసి వారి నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో దిశ కేసు నిందితులు హతమవ్వగా.. నిందితులు జరిపిన ఎదురుకాల్పల్లో వీరిద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్‌లు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో వీరిని కలిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం.. దాదాపు అరగంటపాటు వారిని ప్రశ్నించి.. పలు వివరాలు సేకరించింది.
ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం దిశ కుటుంబసభ్యులు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకొని.. వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్‌కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితోపాటు సోదరిని ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.
చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు యువకుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచేందుకు నాలుగు ఫ్రీజర్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి మార్చురీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుల మృతదేహాలను వచ్చే శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment