సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. నిందితులను పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. తమ కస్టడీలో వారిని విచారించి.. కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు. అయితే, నిందితులను మరోచోటుకు తరలించి విచారించాలా? లేక జైల్లోనే విచారించాలా? అనేదానిపై పోలీసులు తర్జనభర్జనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
దిశ హత్యాచారం కేసుపై తీవ్ర ప్రజాగ్రహం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నిందితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దిశను అమానుషంగా అత్యాచారం చేసి.. ఆపై చంపేసిన నలుగురు నిందితుల్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాగ్రహం దృష్ట్యా.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశముండటంతో నిందితులు వేరే ప్రాంతానికి తరలించి విచారించే విషయంలో పోలీసులు వెనుకాముందు ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైల్లోనే నిందితులను విచారించి.. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోనున్నట్టు సమాచారం. కస్టడీ విచారణలో భాగంగా భారీ భద్రత మధ్య నిందితులను సంఘటనాస్థలానికి తీసుకెళ్లి.. అక్కడ మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment