బీసీ ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ విడుదల చేస్తున్న కృష్ణయ్య, మారేష్, బేబీరాణి తదితరులు
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): ఈ నెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హైదరాబాద్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను కృష్ణయ్య విడుదల చేశారు. ఈ సమావేశ వివరాలను ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించి బీసీల సత్తా చాటేలా ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కృష్ణయ్య సూచించారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలంతా ఏకమై పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఏపీ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి పాల్గొన్నారు. అనంతరం బీసీ సంఘ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా మల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర కన్వీనర్‌గా సనపాల లక్ష్మీనరసింహ, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా అనిల్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వెంకటాచార్యులు, రాష్ట్ర కన్వీనర్‌గా తన్నీరు సుబ్బారావు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాధవికి కృష్ణయ్య నియామకపత్రాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment